Balineni Srinivas Reddy: పవన్ సినిమాల్లో నటించరా? మరో ఒక్క సినిమాలో మాత్రమే నటిస్తారా? అక్కడితో బ్రేక్ చెబుతారా? జనసేన నేత బాలినేని ప్రకటనలో నిజం ఎంత? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ. 2024 తర్వాత పవన్ హరిహర వీరమల్లు, తాజాగా ఓజి చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలు 2024 ఎన్నికలకు ముందే సిద్ధమయ్యాయి. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో షూటింగులు పెండింగ్లో ఉండిపోయాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ శరవేగంగా ఈ సినిమా షూటింగ్లలో పాల్గొన్నారు. ఈ రెండు సినిమాలు విడుదలయ్యాయి. అయితే తాజాగా ఓజి చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే ఓ జి సెకండ్ పార్ట్ ఉంటుందని తెలుస్తోంది. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ మరో చిత్రంలో నటించి.. తర్వాత సినిమా షూటింగ్లకు గుడ్ బై చెబుతారని.. పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెడతారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అయితే మిగిలిన ఒకే ఒక్క సినిమా గురించి ప్రస్తావించిన బాలినేని.. అది తన నిర్మాణ సారథ్యంలో వస్తుందని ఆశిస్తున్నారు.
* సినిమా చేయాలని ఆరాటం.. పిఠాపురంలో( Pithapuram) జనసేన ఆవిర్భావ సభ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సభలో పవన్ కళ్యాణ్ బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఎంతో ప్రాధాన్యమిచ్చారు. బాలినేని సైతం తాను పదవుల కోసం జనసేనలో చేరలేదని.. తాను నిర్మాతగా ఉన్న సినిమాల్లో నటించాలని పవన్ కళ్యాణ్ ను వేడుకున్నారు. అదే సభలో తన ఆస్తినంతటిని జగన్మోహన్ రెడ్డి బలవంతంగా లాక్కున్నారని కన్నీటి పర్యంతమౌతూ చెప్పారు. తద్వారా పవన్ కళ్యాణ్ తో సినిమా తీసి తాను కోల్పోయిన ఆస్తులను పొందాలని బాలినేని చూస్తున్నారు. అయితే తనతో సినిమా తీసిన తర్వాత రాజకీయాలపై పూర్తిస్థాయిలో పవన్ దృష్టి పెడతారని బాలినేని చెప్పడం మాత్రం కాస్త అనుమానమే.
* ఒంగోలులో భారీ బహిరంగ సభ..
వాస్తవానికి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి( balineni Srinivas Reddy ) రాజకీయంగా అవకాశాలు లేవు. ఆయన ఎమ్మెల్సీగా కానీ.. రాజ్యసభ సభ్యుడిగా కానీ వెళ్తారని ప్రచారం జరుగుతోంది. దానికి కారణం లేకపోలేదు. ఒంగోలులో ఇప్పుడు స్పేస్ లేదు. పేరుకే బాలినేని కూటమినేత కానీ ఎటువంటి ఆహ్వానాలు లేవు. అసలు ఆయన జనసేనలో చేరడం ఒంగోలు టిడిపి ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనకు ఇష్టం లేదు. చాలాసార్లు అభ్యంతరాలు కూడా పెట్టారు. అయితే రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వకుండా… పవన్ కళ్యాణ్ కు ఆప్త నేతగా మాత్రమే బాలినేని కి ఛాన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బాలినేని మాత్రం పట్టువదలని విక్రమార్కుడిగా తన ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఒంగోలులో తన అనుచరులను జనసేనలోకి పంపించాలని చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వారిని నిలపడం ద్వారా.. 2029 ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అందుకే త్వరలో పవన్ కళ్యాణ్ తో ఒంగోలులో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆయన ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.