Baalineni Srinivasa Reddy : బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీని ఎందుకు వీడినట్టు? తనకు గుర్తింపు లేదనా?లేకుంటే పార్టీలో తన ప్రత్యర్థులకు ప్రాధాన్యం ఇస్తున్నారనా? అసలు కారణమేంటి? జగన్ తో బంధం తెంచుకోవడానికి ఎందుకు డిసైడ్ అయ్యారు? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ. జగన్ పిలిస్తే కాంగ్రెస్ నుంచి వచ్చేసారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. పార్టీ ఆవిర్భావం నుంచి తన వెంట అడుగులు వేయడంతో జగన్ కూడా అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాబినెట్లో చోటిచ్చారు. కీలకమైన విద్యుత్ శాఖను కట్టబెట్టారు. విస్తరణలో పదవిని తొలగించారు. అది మొదలు బాలినేని నిత్య అసంతృప్తి వాదిగా మారిపోయారు. కేవలం ప్రకాశం జిల్లాలో తన మాట చెల్లుబాటు కోసమే ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వైసిపి తో పాటు అనుకూల మీడియాలో వేరే చర్చ నడుస్తోంది. ఆర్థిక వ్యవహారాలతోనే బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది.
* అప్పట్లో ఎంతో దర్పం
జగన్ సర్కారులో బాలినేని విద్యుత్ శాఖను నిర్వర్తించారు. అప్పట్లో దూకుడుగా ఉండేవారు. ఏకంగా చార్టర్డ్ ఫ్లైట్లో ప్రయాణించేవారు. విదేశాలకు ప్రత్యేక విమానంలో వెళ్లేవారు. అయితే ఇది మింగుడు పడని జగన్ మంత్రి పదవి నుంచి బాలినేని ని తప్పించారని టాక్ నడిచింది. బాలినేని దర్పం ప్రదర్శించడం జగన్ కు నచ్చలేదని తెలిసింది. ఇలానే వదిలేస్తే బాలినేని ఎంతవరకైనా వెళ్తారని భావించి.. మంత్రి పదవి నుంచి తొలగించినట్లు అనుమానాలు ఉన్నాయి. ఈ విషయంలో వైవి సుబ్బారెడ్డి కీరోల్ పోషించినట్లు తెలుస్తోంది.
* ఊహించిన దానికి భిన్నం
వాస్తవానికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జగన్ కోసం గొప్పగా ఊహించుకున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే తనకు తిరుగులేదని భావించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాదిరిగా రాయలసీమ బాధ్యతలు అప్పగించినట్టు… తనకు ప్రకాశంతో పాటు కోస్తాంధ్ర బాధ్యతలు అప్పగిస్తారని భావించారు. పెద్దిరెడ్డి, బొత్స తో పాటు తనకు మంత్రి పదవులు కొనసాగిస్తారని ఆశించారు. కానీ ఆ రెండు జరగలేదు. పుండు మీద కారం పోసినట్టు.. ప్రకాశం జిల్లాకు చెందిన మరో మంత్రి ఆదిమూలం సురేష్ కు కొనసాగించి.. తనను తప్పించడం బాలినేనికి బాధ కలిగించింది.
*ఆ డబ్బుల కోసమే?
అయితే బాలినేని అసంతృప్తికి మరో కారణం ఉన్నట్లు తెలుస్తోంది. అదే ప్రధాన కారణం అని వైసిపి వర్గాల్లో ప్రచారం సాగుతోంది. విద్యుత్ శాఖ మంత్రిగా బాలినేని ఉన్నప్పుడు ఒక కంపెనీ నుంచి కొంత సొమ్ము వచ్చేలా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే ఒప్పందం ప్రకారం మొత్తం డబ్బు ఇవ్వకపోవడం, కొంత పెండింగ్లో ఉండడం, తనకు ఇవ్వాల్సిన సొమ్ము కోసం బాలినేని అడుగుతుండడంతో.. రచ్చ నడిచినట్లు సమాచారం. చివరికి ప్రభుత్వం పడిపోవడంతో బాలినేని ఆ సొమ్ము ఇప్పించాలని జగన్ పై ఒత్తిడి తెస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం మారడంతో జగన్ చేతులెత్తేశారు. ఆ సొమ్ము ఇప్పించలేనని బాలినేనికి తేల్చి చెప్పారు. అందుకే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారని.. తీవ్ర నిర్ణయం తీసుకున్నారని.. వైసిపి వర్గాలతో పాటు అనుకూల మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి అందులో ఎంత నిజం ఉందో తెలియాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Balineni resigned from the party when he was the minister of power due to jagans failure to pay pending money from a company
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com