Ayyannapatrudu: ఏపీలో( Andhra Pradesh) మంత్రివర్గ విస్తరణ పై మరోసారి బలమైన చర్చ నడుస్తోంది. క్యాబినెట్ లోకి సీనియర్లను తీసుకోవాలని ఆ పార్టీ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. గత కొద్దిరోజులుగా ఏపీ మంత్రులపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించినట్టు కూడా తెలుస్తోంది. అయితే కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. ఇటువంటి సమయంలో సీనియర్లను క్యాబినెట్ లోకి తీసుకోవాలని టిడిపి సోషల్ మీడియాలోనే చర్చ జరుగుతుండడం విశేషం. ప్రధానంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడుని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. ఆయన లాంటి సీనియర్ అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా సమాధానాలు చెబుతారని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. పార్టీలో కూడా ఒక రకమైన చర్చ జరుగుతోంది.
* ప్రతిసారి మంత్రివర్గంలో..
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి విశాఖ జిల్లా కోటా కింద అయ్యన్నపాత్రుడు( ayyannapathrudu) మంత్రి అయ్యేవారు. 1983 పార్టీ ఆవిర్భావం నుంచి ఇదో సంప్రదాయంగా కొనసాగుతోంది. కానీ 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో మంత్రి పదవుల సర్దుబాటు చంద్రబాబుకు కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో సీనియర్ గా ఉన్న అయ్యన్నపాత్రుడు కు స్పీకర్ పదవి ఇచ్చారు చంద్రబాబు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రాజకీయ ప్రత్యర్థులను చురకలు అంటించడంలో అయ్యన్నపాత్రుడు చాలా దూకుడుగా ఉంటారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకునే క్రమంలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. దానిని తిప్పి కొట్టడంలో మంత్రులు విఫలమవుతున్నారన్న విమర్శ టిడిపిలోనే వినిపిస్తోంది. అందుకే స్పీకర్ గా ఉన్న అయ్యన్నపాత్రుడు కి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
* దూకుడు కలిగిన నేత..
అయ్యన్నపాత్రుడు సీనియర్ మోస్ట్ లీడర్. పార్టీలో సైతం సుదీర్ఘకాలం ఉంటూ వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అధికారపక్షం పై తీవ్రస్థాయిలో విరుచుకు పడేవారు. వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ హయాంలో నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరిని తప్పు పట్టేవారు. నిప్పులు తిరిగేవారు. తన మాస్ పంచులతో అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేయగలిగారు. అందుకే అప్పట్లో అయ్యన్నపాత్రుడును టార్గెట్ చేసుకుంది వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ అయ్యన్నపాత్రుడు మాత్రం భయపడలేదు. గట్టిగానే నిలబడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించగలిగారు. పార్టీ అంటే విపరీతమైన అభిమానం ఆయనకు. అందుకే ఇప్పుడు చివరి దశలో ఉన్న ఆయనకు మంత్రి పదవి ఇస్తే గౌరవంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రధానంగా టిడిపి సోషల్ మీడియాలోనే దీనిపై విస్తృతమైన చర్చ నడుస్తోంది. చూడాలి మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..