Avinash Reddy: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీలో కీలక మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. పార్టీ నిర్మాణం పై జగన్ ఫుల్ ఫోకస్ చేయనున్నట్లు సమాచారం. ముందుగా కడప జిల్లా పై ఫోకస్ పెడతారని తెలుస్తోంది. అందులోనూ పులివెందుల నియోజకవర్గంలో మార్పులు జరగనున్నట్లు సమాచారం. మొన్నటి పులివెందుల జడ్పిటిసి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అయితే అధికార పార్టీ అవకతవకలకు పాల్పడడం ద్వారానే అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చేయి దాటాయని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే అక్కడ నుంచి మార్పులు చేయాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. జగన్ విదేశీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఈ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.
* వైయస్ కుటుంబ కోట..
పులివెందుల( pulivendula) అంటేనే వైయస్ కుటుంబానికి పెట్టని కోట. అక్కడ రాజకీయ ప్రత్యర్థులు ఎదుర్కోలేని స్థితి ఉంటుంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న పులివెందులలో మాత్రం వైస్సార్ కుటుంబ హవా నడుస్తూ వచ్చింది. అటువంటి చోట కూటమి ప్రభుత్వం గట్టిగానే దెబ్బ కొట్టింది. జగన్‌లో మార్పులు అప్పటినుంచి ప్రారంభం అయ్యాయి. ప్రక్షాళన అనేది తన నియోజకవర్గం నుంచి మొదలు పెట్టాలని ఆయన భావిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు పులివెందుల బాధ్యతలను అవినాష్ రెడ్డి చూస్తూ వచ్చారు. 2024 ఎన్నికల్లో అవినాష్ రెడ్డిని వివేకానంద రెడ్డి హత్య కేసులో టార్గెట్ చేశారు షర్మిల, సునీత. తద్వారా కడప జిల్లాతో పాటు పులివెందులలో ప్రభావం చూపించారు. జడ్పిటిసి ఎన్నికల్లో ఓటమితో ఇది మరింత స్పష్టమైంది.
* దుష్యంత్ రెడ్డికి బాధ్యతలు..
అందుకే ఇప్పుడు అవినాష్ రెడ్డిని మార్పు చేస్తారని తెలుస్తోంది. దుష్యంత్ రెడ్డి అనే నేతకు బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. అవినాష్ రెడ్డి మాదిరిగా దుష్యంత్ రెడ్డి సైతం జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు. వచ్చే ఎన్నికల్లో పులివెందుల మున్సిపల్ చైర్మన్‌గా దుష్యంత్ రెడ్డిని ప్రకటిస్తారని సమాచారం. అక్కడ బీటెక్ రవి సోదరుడు బరిలో ఉంటారు. అందుకే దుష్యంత్ రెడ్డి అయితే అన్ని విధాల ఎదుర్కొంటారని నమ్మకం పెట్టుకున్నారు. అవినాష్ రెడ్డికి జమ్మలమడుగు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. అక్కడ బలమైన నేతగా ఉన్న ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన హవా తగ్గించాలంటే అవినాష్ రెడ్డి కరెక్ట్ అని భావిస్తున్నారు జగన్. జగన్ విదేశీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఈ కీలక మార్పులపై ప్రకటనలు వస్తాయని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.