TDP MP Magunta Srinivasula Reddy: ఏపీలో( Andhra Pradesh) చాలామంది నేతలు తమ రాజకీయ వారసులను తెరపైకి తెస్తున్నారు. ఇంకా ఎన్నికలకు మూడున్నర సంవత్సరాల గడువు ఉంది. కానీ ముందుగానే ప్రకటనలు చేస్తున్నారు. తమ వారసులకు లైన్ క్లియర్ చేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా కు చెందిన నేత కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ప్రకటించారు. వారసుడు బరిలో ఉంటాడని కూడా తేల్చి చెప్పారు. ఎంతకీ ఎవరా నేత అంటే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి. 2024 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు శ్రీనివాసుల రెడ్డి. వచ్చే ఎన్నికల నాటికి క్రియాశీలక రాజకీయాలనుంచి తప్పుకోవాలని భావిస్తున్నారు. అదే నిర్ణయాన్ని తాజాగా ప్రకటించారు.
* సుదీర్ఘ ప్రస్థానం..
ప్రకాశం జిల్లాలో( Prakasam district) సీనియర్ మోస్ట్ లీడర్ మాగుంట శ్రీనివాసులరెడ్డి. సుదీర్ఘకాలం ఆ కుటుంబం జిల్లా రాజకీయాలను శాసించింది. ముఖ్యంగా ఒంగోలు పార్లమెంటు సీటుపై స్పష్టమైన ప్రభావం చూపింది. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్, టిడిపి ల నుంచి ఆ కుటుంబం ప్రాతినిధ్యం వహించింది. మాగుంట సుబ్బిరామిరెడ్డి హత్య జరిగిన తర్వాత ఆయన భార్య పార్వతమ్మ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అటు తరువాత మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. అత్యధిక సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 2014లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 వైసీపీ నుంచి.. 2024 టిడిపి నుంచి ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 70 సంవత్సరాలు దాటుతోంది. అందుకే కుమారుడు రాఘవరెడ్డిని రాజకీయ వారసుడిగా ప్రకటించి క్రియాశీలక రాజకీయాలకు దూరం కావాలని భావిస్తున్నారు ఆయన. అదే విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు.
* టిడిపి గెలిచింది మూడుసార్లు..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ ఒంగోలులో( Ongole) గెలిచింది మూడుసార్లు మాత్రమే. 1984, 1999, 2024 లో మాత్రమే గెలిచింది. ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం అధికం. అందుకే తొలుత కాంగ్రెస్ ఇక్కడ గణనీయమైన ప్రభావం చూపింది. తరువాత ఆ ఓటు బ్యాంకు వైసీపీ వైపు వెళ్ళింది. అందుకే 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచింది. అయితే వచ్చే ఎన్నికల్లో జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ తరుణంలో మాగుంట వారసుడు రాఘవరెడ్డి బరిలో దిగితే పోటీ ప్రతిష్టాత్మకమే.