Jagan: జగన్( Jagan Mohan Reddy) జనాల్లోకి వస్తున్నారు. జిల్లాల పర్యటనకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. లండన్ పర్యటన ముగించుకొని జగన్ బెంగళూరు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. రెండు రోజుల కిందట ఆయన తాడేపల్లి కి వచ్చారు. నిన్ననే పార్టీ ముఖ్యులతో సమావేశం అయ్యారు. కూటమి ప్రభుత్వ హామీలు, వైఫల్యాలపై చర్చించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ ముఖ్యులకు దిశా నిర్దేశం చేశారు జగన్. పార్టీ నుంచి ఎంతటి నేతలు వెళ్ళిపోయినా భయపడనవసరం లేదని.. ఉన్నవారితోనే రాజకీయం చేద్దామని చెప్పుకొచ్చారట. ఈ నాలుగేళ్లపాటు ప్రజల్లో ఉండి వారితో మమేకమై పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు ఇస్తానని జగన్ అన్నట్లు తెలుస్తోంది. అటు తన జిల్లాల పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వ ఎనిమిది నెలల పాలనలో వ్యతిరేకత కనిపిస్తోందని.. దానిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పార్టీ నేతలకు హితోపదేశం చేశారు జగన్.
* అన్ని అంశాలపై చర్చ
మరోవైపు మార్చి 12న వైసీపీ( YSR Congress ) ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా వేడుకగా నిర్వహించాలని నిర్ణయించారు. అందుకు సంబంధించి కార్యక్రమాల నిర్వహణపై కూడా నిర్ణయం తీసుకున్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ, సీట్ల తగ్గింపు అంశంపై బోరుబాట నిర్వహించాలని పార్టీ నేతలకు జగన్ సూచించారు. పింఛన్ల కోతపై ఆరా తీశారు.. జిల్లాల వారీగా ఎన్ని పింఛన్లు తొలగించారు అన్నది తెలుసుకునే ప్రయత్నం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యత దక్కక పోవడాన్ని తప్పు పట్టారు. కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్న టిడిపి ఈ విషయంలో విఫలమైందని అభిప్రాయపడ్డారు. పోలవరం ఎత్తు కుదింపు, నిధుల ప్రకటన అంశం పైన సుదీర్ఘంగా చర్చించారు జగన్. నేతలు జిల్లాల వారీగా స్థానిక అంశాలపై కార్యాచరణ చేసుకోవాలని.. ప్రజలతోనే మమేకం అవ్వాలని జగన్ నిర్దేశించారు. పార్టీ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటూ.. కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై కూడా చర్చలు జరిపారు. బడ్జెట్ సమావేశాలు కావడంతో.. హాజరు కావడమే మంచిదని ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడ్డారు.
* జిల్లాల టూర్ పై స్పష్టత
మరోవైపు జిల్లాల పర్యటనకు( district Tours ) సంబంధించి జగన్ స్పష్టత ఇచ్చారు. ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశాలు పూర్తయ్యాక జిల్లాల పర్యటన మొదలు పెడతానని చెప్పుకొచ్చారు. ఎప్పటికీ ఏడు జిల్లాల నేతలతో సమావేశాలు పూర్తయ్యాయని.. మిగతా ఆరు జిల్లాల నేతలతో సమావేశాలు పూర్తిచేసి.. ఉగాది నాటికి జిల్లాల పర్యటన ఉంటుందని స్పష్టత ఇచ్చారు జగన్. అయితే సంక్రాంతి తర్వాత అని ముందుగా ప్రకటించారు జగన్. విదేశాలకు వెళ్లి వచ్చిన తర్వాత అని చెప్పుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఉగాది తర్వాత అని చెబుతున్నారు. దీంతో పార్టీ వర్గాల్లో ఒక రకమైన అయోమయం నెలకొంటోంది.
* నేతల అభిప్రాయంతోనే..
అయితే వైసిపి( YSR Congress ) నేతల్లో మాత్రం మరో అభిప్రాయం ఉంది. వీలైనంత త్వరగా జిల్లాల పర్యటన మొదలు పెడితే బాగుంటుందని ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు మాత్రమే అవుతుంది. కనీసం ఏడాది సమయం ఇచ్చి ప్రశ్నించాలని కొంతమంది నేతలు సూచిస్తున్నారు. అందుకే నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు జగన్. ఉగాది నాటికి ఇంచుమించు ఏడాది సమయం అవుతుంది. అప్పటినుంచి ప్రజల్లోకి వెళ్లి సంక్షేమ పథకాల అమలుపై ప్రశ్నిస్తే స్పందన వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో కొందరు వైసీపీ నేతలు సైతం యాక్టివ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. సో ఉగాది వరకు జగన్ కోసం పార్టీ శ్రేణులు ఎదురుచూడాల్సిందే అన్నమాట.