BJP : బిజెపి ( BJP)భారీ స్కెచ్ వేసిందా? దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు సిద్ధపడుతోందా? ఆ బాధ్యతను పవన్ కళ్యాణ్ కు అప్పగించిందా? అందులో భాగంగానే దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ ఆలయాల సందర్శనా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి బలం అంతంత మాత్రమే. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన పార్టీ.. గత ఎన్నికల్లో దారుణంగా దెబ్బతింది. తెలంగాణలో సైతం బలం పెంచుకుంది. ఏపీలో అధికార పార్టీతో భాగస్వామిగా ఉంది. కేరళ, తమిళనాడులో మాత్రం ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బలం పెంచుకోవాలన్న ఆలోచనతో ఉంది. అది పవన్ కళ్యాణ్ ద్వారా చేయాలన్నది బిజెపి ప్లాన్ గా తెలుస్తోంది. అందుకే దక్షిణాది బాధ్యతలను పవన్ పై పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది.
* సనాతన ధర్మ పరిరక్షణకు..
సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్( Pawan Kalyan) డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దానిని సాకారం చేసుకునేందుకుగాను దక్షిణాది రాష్ట్రాల్లో దేవాలయాల సందర్శనకు సిద్ధపడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఐదు రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయాలను పవన్ సందర్శిస్తారు. అయితే దీని వెనుక బిజెపి వ్యూహం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఏపీలో హిందూ ధార్మిక మహాసభను నిర్వహించారు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని.. హిందూ ప్రముఖులు, స్వామీజీలు, పీఠాధిపతులు పిలుపునిచ్చారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభ సక్సెస్ అయ్యింది. మరోవైపు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ను మరింత విస్తృతం చేయాలని భావిస్తున్నారు.
* ఆలయాల సందర్శన
ఈ ప్రత్యేక నినాదంతో ఐదు రాష్ట్రాల్లో పవన్( Pawan Kalyan) బలమైన ప్రయత్నం చేయనున్నారు. తద్వారా ఎన్డీఏ బలోపేతంతో పాటు బిజెపి అభివృద్ధికి దోహదపడనున్నారు. ఉత్తరాధి రాష్ట్రాల్లో బిజెపికి క్రమేపి బలం తగ్గుతోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో బిజెపి చాలా నష్టపోయింది. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి కొంతవరకు ఉనికి చాటుకుంది. మిత్రుల ద్వారా బలం పెంచుకుంది. మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగలిగింది. లేకుంటే మాత్రం చాలా కష్టం. తెలుగుదేశం పార్టీ తన 16 ఎంపీ సీట్లతో.. జెడియు తన 12 ఎంపీ సీట్లతో మద్దతు తెలపడం ద్వారానే.. ముచ్చటగా మూడోసారి ఈ దేశానికి మోడీ ప్రధాని అయ్యారు. మరోసారి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలని చూస్తోంది బిజెపి.
* పవన్ కు ప్రత్యేక చరిష్మ
పవన్ కళ్యాణ్ కు( Pawan Kalyan) చరిష్మ ఉంది. పైగా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఆయనకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఆపై పవన్ హిందుత్వ వాదాన్ని తెరపైకి తెచ్చారు. ఇతర మతాలను గౌరవిస్తూనే హిందూ మతానికి కూడా అదే స్థాయిలో గౌరవం దక్కాలన్నది పవన్ కళ్యాణ్ అభిమతం. అందుకే పవన్ హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఇచ్చిన పిలుపు బలంగా వినిపించింది. చాలామంది ఆహ్వానించారు కూడా. సరిగ్గా ఇటువంటి సమయంలోనే బిజెపి ప్లాన్ చేసింది. పవన్ ద్వారా బలోపేతం కావాలని భావించింది. అందులో భాగంగానే పవన్ దక్షిణాది రాష్ట్రాల్లో ఆలయాల సందర్శన అని తెలుస్తోంది.