Mudragada: కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి టార్గెట్ అయ్యారు. ఆయన ఇంటి పై తాజాగా దాడి జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ముద్రగడ ఇంటిపై దాడి జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి అటువంటి దాడి జరగడం హాట్ టాపిక్ అవుతోంది. కాకినాడ జిల్లాలోని కిర్లంపూడి లో గల ముద్రగడ పద్మనాభం ఇంటిపై తెల్లవారుజామున ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. ఏకంగా ట్రాక్టర్ తో దాడికి దిగాడు. ఇంటి గేటు విరగ్గొట్టి మరి లోపలికి ప్రవేశించాడు. జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంటి ఆవరణలో ఉన్న కారును సైతం ఢీకొట్టడంతో.. దాని వెనుక భాగం దెబ్బతింది.
* ఆందోళనకు గురైన ముద్రగడ
అయితే ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనలతో ముద్రగడ పద్మనాభం ఆందోళనకు గురయ్యారు. ఆ సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇంట్లో ఉన్న ముద్రగడ అనుచరులు ఆ వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న ముద్రగడ అభిమానులు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో కిర్లంపూడి లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముద్రగడ ఇంటివద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. అదే సమయంలో వైసీపీ శ్రేణులు భారీగా అక్కడికి తరలి వచ్చాయి. ముద్రగడను నేతలు పరామర్శించారు.
* సుదీర్ఘకాలం టిడిపిలో
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే ఇటువంటి ఘటనలు జరుగుతుండడం విశేషం. ముద్రగడ పూర్వాశ్రమంలో తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. సుదీర్ఘకాలం ఆ పార్టీ నుంచి ప్రజాప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించారు. మంత్రిగా కూడా కొద్దిరోజులపాటు బాధ్యతలు నిర్వర్తించారు. చంద్రబాబుతో విభేదించి టిడిపి నుంచి బయటకు వెళ్లిపోయారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాపు రిజర్వేషన్ ఉద్యమంతో సుపరిచితుడైన ముద్రగడ.. తరువాత రాజకీయంగా మాత్రం దెబ్బతిన్నారు. 2014లో టిడిపి అధికారంలోకి రావడంతో ఎన్నికల హామీ మేరకు కాపు రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద ఉద్యమమే చేశారు. అప్పట్లో వివాదం వివాదాస్పదం అయింది. తునిలో రైలు దహనానికి దారితీసింది. అప్పటి టిడిపి ప్రభుత్వానికి ముద్రగడ ఉద్యమం డామేజ్ చేసింది.
* ఉద్యమం నిలిపివేత
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ తన ఉద్యమాన్ని నిలిపివేశారు. దీంతో జగన్ ప్రయోజనాల కోసమే ముద్రగడ ఉద్యమం నడిపారన్న టాక్ వినిపించింది. ఎన్నికలకు ముందు ముద్రగడ జనసేన లో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కానీ పవన్ నుంచి విముఖత రావడంతో ఆయన చివరి నిమిషంలో వైసీపీలో చేరాల్సి వచ్చింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించి తీరుతానని ముద్రగడ సవాల్ చేశారు. అలా జరగని పక్షంలో తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని కూడా శపథం చేశారు. ఏపీలో కూటమి గెలవడమే కాకుండా పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో ముద్రగడ పేరు మార్చుకోవాల్సి వచ్చింది. అయితే తాజాగా ఆయన ఇంటిపై జనసేన పేరుతో దాడికి దిగడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.