Sathya Sai District: ఏపీలో ప్రభుత్వ వైద్య సేవలు పెంచినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష పేరిట హడావిడి చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఎక్కడికక్కడే జ్వరాలు ముసురుతున్నాయి. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. మెరుగైన వైద్య సేవలు అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అటు ఆసుపత్రి సిబ్బంది సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో జ్వరంతో ఓ బాలుడు మృతి చెందగా.. కనీసం మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ ఇవ్వలేదు. దీంతో కొడుకు మృతదేహాన్ని బైక్ పై ఓ తండ్రి తీసుకెళ్లాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ఈ ఘటన సత్య సాయి జిల్లాలో వెలుగు చూసింది.
సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం పరిధిలోని. అమరాపురం మండలం హనుమంతనపల్లి గ్రామానికి చెందిన రిషి అనే ఐదేళ్ల బాలుడు గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడ్డాడు. కుటుంబ సభ్యులు మడకశిరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. రిషికి డెంగ్యూ గా నిర్ధారణ అయింది. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ కావాలని తల్లిదండ్రుల కోరారు. కానీ ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తరలించాల్సి వచ్చింది.
పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని రిషి తల్లిదండ్రులు లింగప్ప, రాధమ్మలు బైక్ పై కుమారుడి మృతదేహాన్ని తీసుకెళ్లడం అక్కడున్న వారిని కలిచివేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. బైక్ పై కొడుకు మృతదేహాన్ని తరలిస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంతలా తల్లఢిల్లి పోయి ఉంటారో అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏపీలో వైద్యం తీరు ఇది అంటూ విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తీరుపై మండిపడుతున్నారు.