Chittoor: దేశ స్వాతంత్ర ఉద్యమం లో ప్రజలందరినీ ఏకతాటి పైన నిలపడానికి బాలగంగాధర తిలక్ గణపతి చవితి వేడుకలను తెరపైకి తీసుకొచ్చారు. పేరుకు ఆధ్యాత్మికం లాగా కనిపించినప్పటికీ.. దేశ ప్రజలందరినీ ఏకతాటి మీద నిలపడానికి.. స్వాతంత్ర ఉద్యమంలో పాలుపంచుకోవడానికి కృషి చేశారు. తిలక్ కృషి వల్ల నాటి రోజుల్లో ప్రజలకు స్వాతంత్ర ఉద్యమంపై ఆసక్తి ఏర్పడింది. ఉద్యమంలో పాలుపంచుకోవాలని కోరిక కూడా కలిగింది. అది ఆంగ్లేయులపై వ్యతిరేకతకు కారణమైంది. అందువల్లే వినాయక చవితి వేడుకలను మనదేశంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. నేటికీ తిలక్ వారసత్వం విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. స్వాతంత్రోద్యమంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ పోరాటాన్ని నిర్వహిస్తే.. తిలక్ మాత్రం స్వాతంత్ర ఉద్యమానికి ఆధ్యాత్మికతను జోడించారు. తద్వారా దేశ స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో తనకంటూ ఒక పేజీని రాసుకున్నారు.
Also Read: జగన్, కెసిఆర్ సర్వశక్తి సంపన్నులు.. వారిని మన వ్యవస్థలు ఏమీ చేయలేవు
స్వాతంత్ర ఉద్యమం మాత్రమే కాదు వినాయకుడి వృత్తాంతం కూడా చాలా గొప్పది. తల కోల్పోయినప్పటికీ.. జంతువు శిరస్సును తనకు జోడించినప్పటికీ.. తోటి దేవుళ్ళు హేళన చేసినప్పటికీ.. అచంచలమైన ఆత్మవిశ్వాసంతో గొప్ప దేవుడిగా వెలుగొందాడు గణపతి. ఆది పూజ అందుకునే దేవుడిగా అవతరించాడు. అటువంటి దేవుడి వేడుకలను ప్రతి ఏడాది మన దేశంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు.. భజనలకు వినాయక చవితి మండపాలను కేంద్రంగా చేసుకుంటారు. ఇక ఇటీవల కాలంలో అన్నదానాలు.. పూజలు నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇంతటి ఐతిహ్యం ఉన్న గణపతి వేడుకలను కొంతమంది నీచాతి నీచమైన కార్యక్రమాలకు కేంద్రంగా చేసుకుంటుండడం ఆవేదన కలిగిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో గణపతి మండపాల వద్ద దారుణమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. పలమనేరు మండలం టి వడ్డూరు గ్రామంలో తమిళనాడు ప్రాంతం నుంచి తీసుకొచ్చిన మహిళలతో అర్థనగ్నంగా డాన్సులు వేయిస్తున్నారు. మహిళలు పొట్టి దుస్తులు ధరించి.. ద్వంద్వార్థాలతో కూడిన పాటలకు డ్యాన్సులు వేస్తున్నారు. రాత్రిపూట అక్కడ అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇటువంటి పనికిమాలిన కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. ఇక గణపతి వేడుకల దగ్గర జరుగుతున్న దారుణమైన డ్యాన్సులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఆ వీడియోలను చూసిన నెటిజన్లు నిర్వాహకులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.