AP Free Bus: బస్సు పథకానికి బాబు సిద్ధం

సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు.. తరువాత రోజు బాధ్యతలు స్వీకరించారు. కీలకమైన ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైల్ పై తొలి సంతకం చేశారు.

Written By: Dharma, Updated On : June 16, 2024 11:43 am

AP Free Bus

Follow us on

AP Free Bus: ఏపీలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా.. చంద్రబాబు ఆర్టీసీ పల్లె వెలుగుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వచ్చే నెల నుంచి అమలు చేయడానికి కసరత్తు ప్రారంభించారు ఏపీ అధికారులు. ఈ పథకంతో ఎంత భారం పడుతుంది? ఆర్టీసీ సర్వీసులపై చూపే ప్రభావం ఎంత? వంటి అంశాలపై అధికారులు దృష్టి పెట్టారు. మార్గదర్శకాలు రూపొందించే పనిలో పడ్డారు. ఇప్పటికే రవాణా శాఖ మంత్రి దీనిపై స్పష్టమైన ప్రకటన కూడా చేశారు.

సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు.. తరువాత రోజు బాధ్యతలు స్వీకరించారు. కీలకమైన ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైల్ పై తొలి సంతకం చేశారు. పింఛన్ మొత్తాన్ని 4వేల రూపాయలకు పెంచుతూ.. రెండో ఫైల్ పై సంతకం చేశారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అంశానికి సంబంధించి మూడో ఫైల్ పై సంతకం చేశారు. అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ, నైపుణ్య గణన వంటి పైళ్లపై మిగతా సంతకాలు పూర్తి చేశారు. దీంతో మరో హామీ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం పథకం పై చర్చ ప్రారంభమైంది? అసలు ఈ పథకాన్ని ప్రారంభిస్తారా? లేదా? అన్న అనుమానం నెలకొంది.

కర్ణాటకలో ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రకటించింది. అక్కడి మహిళలకు ఆకర్షించింది ఈ పథకం. అందుకే కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి రాగలిగింది. తరువాత తెలంగాణ ఎన్నికలు జరగడంతో ఇదే పథకాన్ని కాంగ్రెస్ పార్టీ మరోసారి ఫాలో అయ్యింది. అక్కడ కూడా రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆ రెండు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యాయి. నాన్ స్టాప్, సూపర్ లగ్జరీ తప్పించి మిగతా సర్వీసులకు ఉచిత ప్రయాణం వర్తింపజేయడంతో ఆ రెండు రాష్ట్రాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే ఏపీలో మాత్రం చంద్రబాబు తెలివిగా.. ఈ ఉచిత ప్రయాణాన్ని పల్లె వెలుగు బస్సులకే పరిమితం చేశారు. అందుకే ఇప్పుడు పల్లె వెలుగుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి మార్గదర్శకాలు తయారు చేసే పనిలో పడింది చంద్రబాబు ప్రభుత్వం. వీలైనంతవరకు జూలై నుంచి ఈ పథకం ప్రారంభించాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.