Chandrababu Politics: చంద్రబాబుకు( AP CM Chandrababu) తెలుగు రాష్ట్రాలు సమానమా? ఏపీతోపాటు తెలంగాణ కూడా ఆయనకు కీలకమా? ఆయన దశాబ్ద కాలం కిందటి మాట ఎందుకు అంటున్నారు? తిరిగి తెలంగాణలో టిడిపిని యాక్టివ్ చేసేందుకేనా? లేకుంటే తనకు నమ్మకమైన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకా? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అదే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు. రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. పదేళ్లపాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉండగా ముందే ఏపీకి చేరుకొని అమరావతిని డెవలప్ చేశారు. కానీ ఇంతలో ప్రజలు మార్పు కోరుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు మరోసారి చంద్రబాబు నేతృత్వంలోని కూటమికి పట్టం కట్టారు. అయితే ఇప్పుడు ఏపీతోపాటు తనకు తెలంగాణ సమానమేనని ఆయన చెప్పడం కాస్తా భిన్నంగా ఉంది. దీనిని నమ్మేస్థితిలో మాత్రం తెలుగు రాష్ట్రాల ప్రజలు లేరు.
ప్రత్యేక పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా..
1995లో తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు. ప్రత్యేక పరిస్థితుల్లో ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 1999లో భారతీయ జనతా పార్టీతో( Bhartiya Janata Party) గుర్తుపెట్టుకుని రెండోసారి చంద్రబాబు సొంతంగా అధికారంలోకి రాగలిగారు. అయితే 1999 నుంచి 2004 మధ్య అనేక రాజకీయ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. చంద్రబాబు రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత క్యాబినెట్లో స్థానం దక్కలేదని చెప్పి కల్వకుంట చంద్రశేఖర రావు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కెసిఆర్ టిడిపి నుంచి బయటకు వెళ్లి ఉద్యమ పార్టీని ఏర్పాటు చేయడం తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూర్చింది. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ సమాజానికి చంద్రబాబు విలన్ కావడం ప్రారంభం అయ్యారు.
ఆ విషయంలో కెసిఆర్ సక్సెస్..
తెలంగాణ( Telangana) సమాజంలో చంద్రబాబు పట్ల విద్వేషం పెంచడంలో కెసిఆర్ సక్సెస్ అయ్యారు. అదే సమయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఏపీలో బలమైన శక్తిగా మారింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీతో పోరాడుతూనే తెలంగాణలో తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలని టిడిపి ప్రయత్నం చేసింది. అయితే తెలంగాణలో చంద్రబాబు పట్ల వ్యతిరేకత పతాక స్థాయికి చేరింది. ఒక్క హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే తెలుగుదేశం పార్టీ నిలబడింది. మహబూబ్నగర్ తో పాటు ఖమ్మం జిల్లాలో తన ఉనికి చాటుకుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బలపడుతూనే టిడిపి స్థానాన్ని కెసిఆర్ నేతృత్వంలోని ఒకప్పటి టిఆర్ఎస్ నేటి బిఆర్ఎస్ భర్తీ చేయడం ప్రారంభించింది. 2009లో అదే కెసిఆర్ తో మహాకూటమిగా ఏర్పడ్డారు చంద్రబాబు. అది కూడా చంద్రబాబు నాయకత్వాన్ని మరింత నీరుగార్చింది. టిడిపి బలమైన స్థానాలను టిఆర్ఎస్ తో పాటు వామపక్షాలకు కేటాయించాల్సి వచ్చింది. క్రమేపీ తెలంగాణలో చంద్రబాబు నాయకత్వంతో పాటు టిడిపి ఉనికి ప్రమాదకరంగా మారింది. పైగా టిడిపి అనేది సీమాంధ్ర పార్టీగా చిత్రీకరించారు. అందులో సక్సెస్ అయ్యారు.
Also Read: Swarna Andhra Vision 2047: బ్రాండ్ చంద్రబాబు నాయుడు రాజకీయ స్థిరత్వాన్ని తెస్తుందా?
పాలనా దక్షుడిగా పేరు
ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్లో బలమైన పార్టీగా తెలుగుదేశం( Telugu Desam) ఉంది. ఈ సమయంలో చంద్రబాబు తనకు ఏపీతో పాటు తెలంగాణ సమానమని చెప్పడం మాత్రం కాస్త అతి అవుతుంది. ఆయన సీనియర్ నాయకుడిగా చిత్తశుద్ధితో ఆ వ్యాఖ్య చేసినా… తెలంగాణ సమాజం మాత్రం నమ్మేస్థితిలో మాత్రం లేదు. చంద్రబాబును నాయకుడిగా కంటే ఒక పాలనా దక్షుడిగా తెలంగాణ సమాజంలో మంచి పేరు ఉంది. కానీ ఇప్పుడు నేరుగా తెలంగాణ రాజకీయాల్లో ఆయన ప్రవేశిస్తే ప్రజలు నేరుగా నమ్మేస్థితిలో లేరు. కానీ భవిష్యత్తు కార్యాచరణ, టిడిపిని విస్తరించాలన్న ఆలోచనతోనే తనకు ఏపీతోపాటు తెలంగాణ సమానమని చంద్రబాబు చెబుతున్నారు. అయితే ఒక రాజకీయ నాయకుడిగా గెలుపోటములు, సంక్షోభాలు చవిచూసిన చంద్రబాబు.. ప్రతి అంశాన్ని, వైఫల్యాన్ని అధిగమించి పార్టీని నిలబెట్టి ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల విషయంలో కొత్త స్లోగన్ ఇచ్చినట్లు అర్థమవుతోంది.