APSRTC: తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి( Pongal). సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం స్వగ్రామాలకు చేరుకుంటారు పండుగ సమయంలో. అందుకే రవాణాకు సంబంధించి రైళ్లు, బస్సులు కిటకిటలాడుతుంటాయి. ఇప్పటికే పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అయితే వాటిల్లోనూ రిజర్వేషన్లు ఫుల్ అయ్యాయి. తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకంగా హైదరాబాద్ నగరాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక బస్సులను ప్రకటించింది. మరోవైపు ఏపీఎస్ఆర్టీసీ సైతం పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ ప్రత్యేక బస్సు సర్వీసులకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించింది. ప్రధానంగా సంక్రాంతి సమయంలో హైదరాబాద్ నుంచి ఉత్తరాంధ్ర వరకు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఎందుకంటే హైదరాబాదులో సెటిలర్స్ అధికం.
* 600 ప్రత్యేక రైళ్లు..
సాధారణంగా సంక్రాంతి అనేది తెలంగాణ ( Telangana) కంటే ఏపీలో ముఖ్యమైన పండుగ. అయితే దేశవ్యాప్తంగా ఏపీ ప్రజలు ఉన్నారు. వారంతా సంక్రాంతి సమయంలో సొంత గ్రామాలకు వస్తుంటారు. అందుకే రైల్వే శాఖ ఈసారి సంక్రాంతికి 600 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తెలంగాణ ఆర్టీసీ 1200 వరకు స్పెషల్ బస్సులను ఏపీలోని పలు ప్రాంతాలకు కేటాయించింది. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ సైతం విజయవాడ, విశాఖ, తిరుపతి నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. జనవరి 8 నుంచి 14 వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. పండుగ తర్వాత తిరుగు ప్రయాణాల కోసం 17 నుంచి 19 వరకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ఒక్క కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి 596 ప్రత్యేక బస్సులు తిరగనున్నాయి.
* విజయవాడ- హైదరాబాద్.. మచిలీపట్నం- హైదరాబాద్ మధ్య 29 ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. అయితే గత ఏడాది మచిలీపట్నం నుంచి 70 ప్రత్యేక బస్సులు నడిచాయి. విజయవాడ నుంచి 100 బస్సులు తిరిగాయి. అయితే ఈ ఏడాది స్త్రీ శక్తి పథకం అమలు అవుతున్న నేపథ్యంలో ఆ ప్రభావం బస్సుల పై పడింది.
* అయితే ఈ ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం పై అమలుకు చర్చలు జరుగుతున్నాయి.
* ఇప్పటికే సంక్రాంతికి సంబంధించి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు దోపిడీ ప్రారంభం అయింది. పండుగ రద్దీని సొమ్ము చేసుకోవడం ప్రారంభించాయి.