APSRTC: ఏపీ ప్రభుత్వం( AP government ) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగులకు సంబంధించి పదోన్నతులు కల్పించేందుకు సిద్ధపడింది. అంతేకాకుండా ఏపీ ఫైబర్ నెట్ సంస్థకు భారీగా నిధులు కేటాయించింది. గ్రామీణ రహదారుల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది. దేవాదాయ శాఖ పరిధిలోని భూములను సేవా సంస్థలకు కేటాయించేందుకు నిబంధనలు సవరించింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దశాబ్దాలుగా నెలకొన్న సమస్యలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తోంది. ఇటీవల ఉద్యోగులకు పెండింగ్ ఉన్న బకాయిలను చెల్లించింది. అటు తరువాత ఆయా శాఖల్లో అధికారులు, ఉద్యోగుల ప్రమోషన్లు, కారుణ్య నియామకాలను చేపట్టింది.
Also Read: ‘రెట్రో’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఇలా అయితే బ్రేక్ ఈవెన్ అయ్యేది ఎప్పుడు?
* మొన్న ఆ రెండు శాఖల్లో
మొన్న ఆ మధ్యన పంచాయతీరాజ్( Panchayati Raj), గ్రామీణ అభివృద్ధి శాఖలో ప్రమోషన్లు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగులకు పదోన్నతులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మెరిట్ రేటింగ్ రిపోర్టులను పరిగణలోకి తీసుకొని ప్రమోషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో వార్షిక రహస్య నివేదికలు ఆధారంగా పదోన్నతులు ఇస్తారు. కానీ ఆర్టీసీలో మాత్రం మెరిట్రేటింగ్ రిపోర్టులను పరిగణలోకి తీసుకుంటారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 110 మంది ఆర్టీసీ అధికారులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. వైసిపి ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ నిర్ణయంతో ఆర్టీసీ కార్మికులు కాస్త ఉద్యోగులుగా మారారు. కానీ కార్పొరేషన్ లో ఉన్నప్పుడు కలిగిన ప్రయోజనాలు ఇప్పుడు దక్కకుండా పోయాయి అన్న ఆవేదన వారిలో ఉంది.
* మెరిట్ రేటింగ్ ఆధారంగా
ఆర్టీసీలో( APSRTC) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రీజనల్ మేనేజర్, సీనియర్ స్కేల్ అధికారి, చీఫ్ మేనేజర్, డిప్యూటీ చీఫ్ అకౌంట్స్ అధికారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వంటి పోస్టులకు పదోన్నతులు ఇవ్వడానికి ఒక కమిటీ ఇటీవల ఏర్పాటయింది. ఆ సమయంలోనే ఆర్టీసీ అధికారులు పదోన్నతులకు అర్హులైన ఉద్యోగుల వివరాలను అందజేశారు. 2020 జనవరి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. దీంతో వారికి ఏసీ ఆర్ఎస్ ఉండాలని.. అప్పుడే పదోన్నతులు ఇవ్వగలమని కమిటీ చెప్పింది. అందుకే తాజాగా మెరిట్ రేటింగ్ రిపోర్టులు ఆధారంగా పదోన్నతులు ఇచ్చేందుకు నిర్ణయించారు.
* ఫైబర్ నెట్ కు అదనపు నిధులు..
మరోవైపు ఏపీ ఫైబర్ నెట్ సంస్థకు( AP fibernet ) రూ. 112.50 కోట్ల అదనపు నిధులు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రత్యేక నిధులు కింద వినియోగించేందుకు అనుమతించింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అద్వానంగా ఉన్న 1250 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ. 400 కోట్ల నాబార్డు గ్రామీణ మౌలిక అభివృద్ధి నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గుంతలు పూడ్చినా బాగుపడే అవకాశం లేని 191 గ్రామీణ రహదారులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నారు. అలాగే దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల పరిధిలో భూములను ఆస్తులను సేవా సంస్థలకు కేటాయించేలా కూడా తీర్మానించారు.