AP Weather: ఏపీలో( Andhra Pradesh) భిన్న వాతావరణ పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాస్తోంది. సాయంత్రానికి ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. భానుడు సెగలు పుట్టిస్తున్నాడు. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈదురు గాలులతో పాటుగా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అదే సమయంలో వడగాలులు కూడా వీస్తాయని.. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతాయని కూడా స్పష్టం చేసింది. మరి కొద్ది రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని కూడా అంచనా వేసింది.
Also Read: ఇండియా vs పాక్ యుద్ధం : ఐరాస భద్రతా మండలి రహస్య సమావేశంలో అసలేం జరిగింది?
* ఉష్ణోగ్రతలు పతాక స్థాయికి..
శ్రీకాకుళం జిల్లా( Srikakulam district ) నుంచి అనంతపురం వరకు ఉష్ణోగ్రతలు పతాక స్థాయికి చేరుతున్నాయి. 41 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా వాతావరణ శాఖ అల్లెర్ట్స్ జారీచేసింది. నంద్యాల జిల్లా పసుపు లలో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. వైయస్సార్ జిల్లా జమ్మలమడుగులో 42.4°, పల్నాడు జిల్లా రావిపాడు లో 42.1°, కర్నూలు జిల్లా కొలుగొట్లలో 41.8° ఉష్ణోగ్రత నమోదు అయింది. మంగళవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కొన్నిచోట్ల భూగర్భ జలాలు అడుగంటడంతో దాహం కేకలు వినిపిస్తున్నాయి.
* కోస్తాకు వర్ష సూచన..
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు( heavy rain) కూడా కురుస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర కోస్తాకు వర్ష సూచన ఉంది. శ్రీకాకుళం, విజయనగరం,, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి,పల్నాడు, ప్రకాశం జిల్లాలో పలుచోట్ల ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కూడా కొనసాగుతాయి. మేఘాలు కమ్ముకున్న వెంటనే పొలాలు, తోటల్లో ఉండేవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఈనెల చివరి వరకు ఉరుములు, పిడుగుల తీవ్రత కొనసాగే అవకాశం కూడా ఉంది.
Also Read: భారత్‌కు రష్యా సంపూర్ణ మద్దతు.. మోదీ–పుతిన్ సమావేశంలో కీలక పరిణామం