AP Weather Forecast Update: తెలుగు రాష్ట్రాల్లో( Telugu States) వాతావరణం లో మార్పులు సంభవిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడంతో వర్షాలు కురిసాయి. అవి మందగించడంతో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు రుతుపవనాలు తిరిగి వేగం పుంజుకున్నాయి. దీనికి తోడు బంగాళాఖాతంలో ఆవర్తనం ఫలితంగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన పంపింది. ఏపీతో పాటు తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చని అంచనా వేసింది. దీంతో ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే అప్రమత్తం అయ్యాయి.
బంగాళాఖాతంలో ఆవర్తనం..
ఉత్తరాంధ్రకు( North Andhra ) అనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీతోపాటు తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతం అయింది. చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా విస్తాయని చెబుతోంది. ఏపీలో రానున్న 24 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, చిత్తూరు జిల్లాలో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.
Also Read: Census: కుల జనగణన గెజిట్ విడుదల.. ఎప్పుడు పూర్తవుతుందంటే..
ఈ ఏడాది భారీ వర్షాలు..
అయితే రుతుపవనాలు తిరిగి పుంజుకోవడంతో వరుసగా ఉపరితల ఆవర్తనాలు, తుఫాన్లు ఎక్కువగా సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు తుఫానుల తాకిడి అధికం. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలతోనే దేశంలో వ్యవసాయం ఆధారపడి ఉంటుంది. రుతుపవనాలు ఆశించిన స్థాయిలో విస్తరిస్తేనే వర్షాలు సమృద్ధిగా పడే అవకాశం ఉంది. అయితే సుమారు 18 సంవత్సరాల తర్వాత ఏపీకి ముందుగానే రుతుపవనాలు తాకాయి. విస్తరించాయి కూడా. చివరిగా 2009లో ఈ స్థాయిలో రుతుపవనాలు విస్తరించాయి. ఇప్పుడు అంతకంటే ముందే ఏపీని రుతుపవనాలు పలకరించాయి. ఈ ఏడాది ఆశాజనకంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు ఎన్నడూ లేనంతగా మే నెలలో అధిక వర్షపాతం నమోదు కావడం విశేషం.