Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో సిబ్బంది సమాచారం సేకరించారు. సరైన సమాచారం లభించని 44.71 లక్షల ఓట్లను ఎన్నికల సంఘం అన్ కలెక్టబుల్ వర్గంలో చేర్చింది. దీంతో ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవడంతో పాటు ఓటు లేని వారికి మరోసారి ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. వాటికి సంబంధించి విధివిధానాలను కూడా ప్రకటించింది.
* ప్రతిష్టాత్మకంగా సర్వే..
ఓట్లలో పారదర్శకత తెచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా ఈ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సర్వేను చేపట్టింది. నిన్నటితో దీని గడువు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 44.71 లక్షల ఓట్లకు సంబంధించిన సమగ్ర వివరాలు నమోదు కాలేదని గుర్తించారు. ఈనెల 30న ఈసీ అధికారికంగా విడుదల చేయనున్న ప్రాథమిక ఓటర్ల ముసాయిదా జాబితాలో 44.71 లక్షల ఓట్లు ఉండే అవకాశం లేదు. సరైన ఆధారాలు లేకపోవడం, చిరునామా మార్పు, ఓటర్ల గైర్హాజరీ వంటి కారణాలవల్ల తొలగింపునకు గురయ్యాయని యంత్రాంగం చెబుతోంది. చిరునామా మార్పులు, మరణాలు, డబుల్ ఎంట్రీలు,, ఓటర్ల వివరాలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. జూలై 31న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో ఈ పేర్లు ఉండే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు.
* మరో ఛాన్స్..
మరోవైపు వివిధ కారణాలతో ఓట్లు లేకపోతే.. అటువంటి వారికి అర్హత ఉంటే మరో అవకాశం కల్పించాలని భావిస్తోంది ఎన్నికల సంఘం. ఈ నెల 30 నుంచి ఆగస్టు 30 వరకు నెల రోజులపాటు ఈసీకి అభ్యంతరాలు, ఫిర్యాదులు ఫారం 6 ద్వారా.. తెలిపేందుకు అవకాశం కల్పించింది. తమ ఓటు అనుమానాస్పదంగా తొలగించబడిందని భావించేవారు, మార్పులు చేయాలనుకునేవారు తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎన్నికల సంఘం అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి.. అన్ని సరి చూసుకున్న తర్వాత అక్టోబర్ మూడున తుది జాబితాను విడుదల చేయనున్నారు.







