AP Tourism new plan : ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధిపై( Tourism Development) కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పటిష్ట చర్యలు చేపడుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో పర్యాటక రంగానికి పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. అందుకే ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. అయితే ప్రైవేటు భాగస్వామ్యంతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తోంది. పర్యాటక రంగాన్ని ఒక పరిశ్రమ కింద గుర్తించిన ప్రభుత్వం.. పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. ఇప్పటికే చాలా నగరాల్లో పర్యాటకుల కోసం హోం స్టే వంటి విధానాలను ప్రారంభించింది. ప్రైవేటు వ్యక్తుల ఇళ్లను పర్యాటకుల కోసం వాడుకోవాలని భావించింది. విశాఖ నగరం తో పాటు మన్యప్రాంతంలో ప్రైవేటు వ్యక్తుల ఇళ్లకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానించింది. అది కొలిక్కి వస్తున్న తరుణంలో ఇప్పుడు తీర ప్రాంతం, చారిత్రక ప్రదేశాలు, సాంస్కృతిక కట్టడాలను మరింత అభివృద్ధి చేయాలని భావిస్తోంది. తద్వారా పర్యాటకులను ఆకర్షించాలన్న ప్రయత్నంలో ఉంది.
* సమీక్షలో అదే చర్చ..
ఏపీ టూరిజం సమీక్ష సీఎం చంద్రబాబు( CM Chandrababu) అధ్యక్షతన ఇటీవల జరిగింది. పర్యాటక రంగ అభివృద్ధిపై కీలక చర్చలు జరిగాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో హెలిపోర్టులు ఏర్పాటు చేసి.. గిరిజన ప్రాంతాల్లోనూ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని ఆలోచనను చంద్రబాబు అధికారుల వద్ద ప్రస్తావించారు. విశాఖ,పాడేరు, అరకు, లంబసింగి ప్రాంతాలకు నిత్యం పర్యాటకుల తాకిడి ఉంటుంది. అందుకే అటువంటి ప్రాంతాల్లో హెలిపోర్టులు ఏర్పాటు చేయడం ద్వారా సందర్శకులను మరింతగా ఆకర్షించుకోవచ్చు అనేది ప్రభుత్వ ఆలోచన. అయితే దీనిపై అధికారులు కూడా సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
Also Read : ఏపీలో నెల నెలా మహిళలకు ఉచితంగా రూ.2 వేలు.. ప్రభుత్వానికి ప్రతిపాదన చేసిన మాజీ ఎంపీ..
* మన్య ప్రాంతంలో ఏర్పాటు.. హెలికాప్టర్లు( helicopters ) దిగడానికి అనువైన ప్రాంతాన్ని తయారు చేయడమే హెలిపోర్ట్. ఒకటి కంటే ఎక్కువ హెలిపాడ్లను ఒకే చోట ఏర్పాటు చేస్తే దాన్నే హెలిపోర్టు అని పిలుస్తుంటారు. హెలికాప్టర్ల టేకాఫ్, ల్యాండింగ్, పార్కింగ్ కోసం హెలిపోర్టులు ఏర్పాటు చేస్తారు. అయితే హెలిపోర్టుల విషయంలో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రమాణాలు పాటించడం తప్పనిసరి. హెలిపోర్టుల వద్ద ఇంధనం, యాంకర్స్ వంటి కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అత్యవసర సేవల కోసం ఇవి తప్పనిసరి.
* గత ఐదేళ్లుగా నిధులు లేవు..
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తేనే ఉద్యోగ, ఉపాధి మార్గాలు పెరుగుతాయి. ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. అయితే గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పాలనలో దారుణంగా దెబ్బతింది పర్యాటక రంగం. కనీస కేటాయింపులు లేవు. నిధులు మంజూరు చేయలేదు. దీంతో పర్యాటక రంగం పూర్తిగా నిర్వీర్యం అయింది. ఇప్పుడు దానిని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఏజెన్సీలో హెలిపోర్టులు ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటకులను ఆకర్షించవచ్చని ప్లాన్ చేస్తోంది. దీని ద్వారా ఏపీలో పర్యాటకం రంగం అభివృద్ధి చెందుతుందని ఆలోచిస్తోంది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు ఏజెన్సీ ప్రాంతాల్లో హెలిపోర్టుల ఏర్పాటు పై ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.