AP SSC Results 2025: ఏపీలో( Andhra Pradesh) పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఇందులో చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి. కాకినాడకు చెందిన నేహాంజని 600కు 600 మార్కులు సాధించి రికార్డ్ క్రియేట్ చేశారు. పల్నాడు జిల్లాకు చెందిన పావని చంద్రిక ప్రభుత్వ పాఠశాలల నుంచి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినిగా నిలిచింది. చిత్తూరు జిల్లాలో అయితే తండ్రీ కూతురు ఒకేసారి పదో తరగతి ఉత్తీర్ణత సాధించడం విశేషం. పార్వతీపురం మన్యం జిల్లాలో కవలలకు సమానంగా 582 మార్కులు రావడం మరో విశేషం. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఫస్ట్ డివిజన్లో ఉత్తీర్ణత సాధించడం కూడా ఈసారి ప్రత్యేకత. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే పదో తరగతి ఫలితాల్లో ప్రగతి కనిపిస్తోంది. ఉత్తీర్ణత శాతం పెరిగింది.
Also Read: బెంగళూరులో వ్యూహకర్తలతో జగన్!
* సరికొత్త రికార్డు
సాధారణంగా 600కు 600 మార్కులు రావడం ఇదివరకు ఎన్నడూ చూడలేదు. కాకినాడకు( Kakinada) చెందిన నేహాంజని( Neha Anjani) ఈ ఘనత సాధించి రాష్ట్రస్థాయిలో ప్రధము రాలిగా నిలిచింది. మరో ఆరుగురు విద్యార్థులకు 599, మరో 14 మందికి 598 మార్కులు రావడం విశేషం. పల్నాడు జిల్లా జప్పిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పావనిచంద్రికకు 598 మార్కులు వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల నుంచి అత్యధిక మార్కులు తెచ్చుకున్న విద్యార్థినిగా చంద్రిక నిలిచింది. అయితే ఈసారి విద్యార్థులు ఎక్కువగా ఫస్ట్ డివిజన్లోనే ఉత్తీర్ణత సాధించారు. 4,98,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తే.. వారిలో 4,01,597 మంది ఫస్ట్ డివిజన్లో ఉత్తీర్ణత సాధించడం విశేషం.
* కూతురుతో పాటే ఉత్తీర్ణత
చిత్తూరు( Chittoor) జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో ఆసక్తికర పరిణామం వెలుగు చూసింది. తండ్రీ కూతురు ఒకేసారి పదో తరగతి ఉత్తీర్ణత సాధించడం విశేషం. రొంపిచర్ల పాలెం వీధికి చెందిన బాకా ఇస్మాయిల్ ఆర్టీసీ కండక్టర్. ఆయన కుమారుడు షబ్బీర్ 1995-96లో పదో తరగతి ఫెయిల్ అయ్యారు. అయితే ఆయన తండ్రి ఇస్మాయిల్ కండక్టర్గా పని చేస్తూ చనిపోయారు. ఇంతలో షబ్బీర్ కూడా ప్రమాదవశాత్తు దివ్యాంగుడిగా మారారు. అయితే తన తండ్రి ఉద్యోగం తనకు దక్కుతుందని భావించి ఈ ఏడాది.. దూరవిద్యలో పదో తరగతి పరీక్ష రాశాడు. ఆయన కుమార్తె సమీనా సైతం పదో తరగతి పరీక్షలు ఇదే ఏడాది రాసింది. అయితే ఫలితాల్లో షబ్బీర్ కు 319 మార్కులు వచ్చాయి. సమీనా 39 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది.
* కవలలకు సమానంగా మార్కులు..
పార్వతీపురం మన్యం జిల్లాలో( parvatipuram manyam district ) సైతం విచిత్ర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బలిజిపేట మండలం వంతరం కు చెందిన బెవర శరణ్ కార్తికేయ, బెవర సింధు శరణ్య కవలలు. అయితే పదో తరగతి ఫలితాల్లో ఇద్దరికీ సమానంగానే మార్కులు వచ్చాయి. అన్నా చెల్లెలు 582 మార్కులు చొప్పున సాధించారు. వారి తండ్రి రాము న్యాయవాది కాగా.. తల్లి కస్తూర్బా విద్యాలయంలో ఉద్యోగిని. ఇలా పదో తరగతి ఫలితాల్లో చిత్రవిచిత్రాలు వెలుగులోకి వచ్చాయి.
Also Read: వేసవి సెలవుల్లో మధ్యాహ్నం భోజనం.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!