https://oktelugu.com/

AP SSC Results : ఆ 38 ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఒక్కరూ పాస్ కాలేదు

పదో తరగతి ఫలితాలను విజయవాడలో పాఠశాల విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఫలితాలను ప్రత్యేక వెబ్ సైట్ లో ఉంచినట్టు తెలిపారు.

Written By:
  • Dharma
  • , Updated On : May 6, 2023 / 04:19 PM IST
    Follow us on

    AP SSC Results : నాడునేడు పథకంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని ఏపీ సర్కారు ఆర్భాటంగా ప్రకటించింది. కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ విద్యను అందిస్తున్నట్టు చెప్పుకొస్తోంది. ఉత్తమ విద్యాబోధనతో ప్రభుత్వ పాఠశాలలను మార్చిన ఘనత వైసీపీ సర్కారుదేనంటూ మాటలు చెప్పింది. అయితే ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఉత్తీర్ణతాపరంగా వెనుకబడ్డాయి.ఏకంగా 38 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా ఉత్తీర్ణత కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనను ప్రశ్నించేలా ఈ ఫలితాలు ఉన్నాయి. పదో తరగతి ఫలితాలను విజయవాడలో పాఠశాల విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఫలితాలను ప్రత్యేక వెబ్ సైట్ లో ఉంచినట్టు తెలిపారు.

    బాలురు కంటే బాలికలే టాప్ స్థానంలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా 72.26 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలురు 69.27 శాతం,  బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మాదిరిగానే బాలురు కన్నా బాలికలే అత్యధిక ఉత్తీర్ణత సాధించడం విశేషం. బాలుర కన్నా బాలికలే 6.11 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం 5 శాతం ఉత్తీర్ణత పెరిగినట్టు ప్రభుత్వం చెబుతోంది. 933 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది.ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అత్యధికంగా 95.25 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది.

    ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమ్యాయి. అదే నెల 18 వరకూ కొనసాగాయి.  మొత్తం 609081 మంది రెగ్యులర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.  605052 మంది విద్యార్థులు మాత్రమే పరీక్ష రాశారు. వీరిలో 309245 మంది బాలురు 295807 మంది బాలికలు ఉన్నారు. ఉత్తీర్ణత శాతం పరంగా జిల్లాల వారీగా చూస్తే పార్వతీపురం మన్యం జిల్లా 87.47 శాతంతో అగ్రస్థానం దక్కించుకుంది. 60.39 శాతం ఉత్తీర్ణతతో నంద్యాల జిల్లా చివరి స్థానంలో నిలిచింది.  కాగా పదో తరగతి పరీక్షల్లో తప్పినవారికి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 2వ తేదీ నుంచి 10 వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్న విద్యార్థులు మే 17వ తేదీ లోపు దరఖాస్తు చేసుకొని పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. రూ.50 ఆలస్య రుసుంతో మే 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులబాటు ఉందన్నారు.