https://oktelugu.com/

Telangana Govt- GOs: మన దేశానికి చూపించాలనుకుంటున్న తెలంగాణ మోడల్ ఈ చీకటి జీవోలేనా కేసీఆర్ సార్?

ప్రభుత్వం ఇలా చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) ను ఉల్లంఘించడమే అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుందని వారు వివరిస్తున్నారు.

Written By:
  • Rocky
  • , Updated On : May 6, 2023 / 04:03 PM IST
    Follow us on

    Telangana Govt- GOs: “పారదర్శకతే పాలనకు గీటురాయి.” ప్రజాస్వామ్యం గురించి రాసేటప్పుడు అబ్రహం లింకన్ మహాశయుడు దీని గురించే ప్రస్తావించాడు. రోజులు మారుతున్నా కొద్దీ ప్రజాస్వామ్యం స్వరూపం పూర్తిగా మారిపోతున్నది. అంతేకాదు ఐదేళ్ల కాల పరిమితి మాత్రమే అయినప్పటికీ ఏలుబడిలో ఉన్నవారు రాజరిక పోకడలు పోతున్నారు. కళ్ళు చెదిరే రాజప్రసాదాలు, తమకు నచ్చిన వారికి కీలక పదవులు, తమ ఆడంబరాలకు కోటానుకోట్లు ఖర్చు చేస్తూ అసలు సిసలైన వ్యక్తిస్వామ్యాన్ని కళ్ళ ముందు ఉంచుతున్నారు. ఓటు వేసి గెలిపించిన ప్రజల పై అప్పుల భారం మోపుతున్నారు. పోనీ ఖర్చులకు సంబంధించైనా, కొత్త విధానాలకు సంబంధించైనా వెలువరించే జీవో లైనా పారదర్శకంగా ఉన్నాయంటే? ఈ ప్రశ్నకు లేదు అనే సమాధానమే వస్తున్నది. ఇక ఇలాంటి నమూనానే ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తూ, ఇదే తెలంగాణ మోడల్ అని డబ్బా కొడుతున్నారు. తనకున్న ఆర్థిక సంపత్తి ద్వారా దేశం మొత్తం ప్రచారం చేసుకుంటున్నారు.

    కనిపించడం లేదు

    వివిధ శాఖల్లో పని చేస్తున్న 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామంటూ సీఎం కేసీఆర్ శాసనసభ వేదికగా ప్రకటించారు. ఈ మేరకు పది ప్రభుత్వ శాఖల్లోని 5,544 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులు క్రమబద్దీకరిస్తూ ఏప్రిల్ 30న రాష్ట్ర ఆర్థిక శాఖ జీవో నెంబర్ 38 జారీ చేసింది. వాస్తవంగా అయితే ఈ జీవో.. ప్రభుత్వ వెబ్ సైట్ http://goir.telangana.gov.in లో కనపడాలి. కానీ కనిపించడం లేదు. అంతేకాదు ఐఏఎస్ అధికారులు కోరం అశోక్ రెడ్డి, బి. గోపి, ఆశీష్ సంగ్వాన్ లను బదిలీ చేస్తూ, పోస్టింగులు ఇస్తూ ఏప్రిల్ 28న సాధారణ పరిపాలన శాఖ జీవో నెంబర్ 613 జారీ చేసింది. మరో ఇద్దరు ఐఏఎస్ లు కే. హైమావతి, ఎం. సత్య శారదా దేవి సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని అందులోనే ఆదేశించింది. ఇది కూడా కనిపించడం లేదు. ఇక మహారాష్ట్రకు చెందిన శరద్ మర్కడ్ ను ముఖ్యమంత్రి ప్రైవేటు సెక్రటరీగా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ జీవో నెంబర్ 647 జారీ చేసింది. ఈ జీవో ను మే 2 న జారీ చేసినట్టు ప్రకటించినప్పటికీ.. మే 5 న పలు వాట్సప్ గ్రూపుల ద్వారా బయటికి వచ్చింది.

    ప్రభుత్వం ఇష్టారాజ్యం

    ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ప్రభుత్వం పారదర్శకతకు పాతర వేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. వాస్తవానికి ప్రభుత్వం తీసుకునే ఎటువంటి నిర్ణయమైనా జీవో రూపంలో ఉండాలి. మరీ ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి. కానీ, పలు ముఖ్యమైన జీవోలను ప్రభుత్వం దాచిపెడుతోంది. తెలంగాణ ఏర్పడిన దగ్గర్నుంచి ఇప్పటివరకూ ప్రభుత్వం తీరు ఇలాగే ఉంది.. భూ సేకరణ, ఫీజు రీయింబర్స్మెంట్, బదిలీలు, నియామకాలు, నిధుల విడుదల, ఉద్యోగాలకు అనుమతి, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ.. ఇలా ప్రతి కీలకమైన జీవోలను దాచిపెడుతోంది. వాట్సప్ గ్రూపులు లేదంటే, ముఖ్యమంత్రి కార్యాలయ వాట్స్అప్ గ్రూప్ ద్వారా మాత్రమే వాటిని బయట పెడుతోంది. అది కూడా ప్రభుత్వానికి ఇబ్బంది లేదు అనుకునే జీవో లను మాత్రమే వాట్సప్ గ్రూపుల ద్వారా బయటికి తెస్తున్నారు. వివాదాస్పద జీవో అనుకుంటే దానిని అసలు బయట పెట్టడం లేదని, ఉద్దేశపూర్వకంగానే దాచిపెడుతోందనే ఆరోపణలు ఉన్నాయి.

    32 శాఖలకు సంబంధించిన జీవోలు అప్లోడ్ చేయాలి

    ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెబ్సైట్ ద్వారా 32 శాఖలకు సంబంధించిన జీవోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ శాఖలకు సంబంధించి ప్రతి సంవత్సరం 6,000 నుంచి 8 వేల దాకా జీవోలు వెలువడుతుంటాయి. అయితే వీటిలో నిధుల విడుదలకు సంబంధించి మొదలుపెడితే ఉద్యోగుల బదిలీ వరకు ముఖ్యమైన జీవోలను ప్రభుత్వం అప్లోడ్ చేయడం లేదు. 2014 జూన్ రెండు నుంచి 2019 ఆగస్టు 15 వరకు 1,04,171 జీవోలు వెలువడగా, వాటిలో 43,462 జీవోలు వెబ్సైట్లో పొందుపరచలేదు. దీనిపై అప్పట్లో ప్రభుత్వం మీద హైకోర్టు సీరియస్ అయింది. జీవోలు ఎందుకు దాచిపెడుతున్నారంటూ అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది. మిస్సింగ్ జీవోల మొత్తాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. అంతేకాదు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బందుకు సంబంధించిన జీవో కూడా వెబ్సైట్లో అప్లోడ్ కాకపోవడం విశేషం. అయితే దీనిపై ఒక స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో పిల్ వేయగా.. 2021 ఆగస్టులో స్పందించిన హైకోర్టు 24 గంటల్లో జీవో అప్లోడ్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినప్పటికీ సర్కార్ తీరులో ఎటువంటి మార్పు రాలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ ఒకటి నుంచి ఈనెల ఐదు వరకు మొత్తం 35 రోజుల్లో దాదాపు 250 వరకు జీవోలు వెలువరించినట్టు సమాచారం. కానీ ఎటువంటి ఇబ్బంది లేదు అనుకునే వాటినే ప్రభుత్వం అప్లోడ్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి.

    రాజ్యాంగ ఉల్లంఘనే

    ప్రభుత్వం ఇలా చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) ను ఉల్లంఘించడమే అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుందని వారు వివరిస్తున్నారు. హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవడం విశేషం. ఇవి మాత్రమే కాదు ముఖ్యమైన మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ నుంచి వేలాది జీవోలు జారీ అయ్యాయి. వెబ్ సైట్లో పదుల సంఖ్యలో మాత్రమే కనిపిస్తున్నాయి. రవాణా శాఖకు సంబంధించిన ఏ ఒక్క జీవో కూడా వెబ్సైట్లో కనిపించకపోవడం విశేషం.. రాష్ట్రంలో 80 వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి ఆర్థిక శాఖ దశలవారీగా అనుమతులు ఇస్తోంది. ఇప్పటివరకు 62 వేలకు పైగా పోస్టుల భర్తీకి అనుమతులు మంజూరు చేసింది. వీటికి సంబంధించిన ఏ ఒక్క జీవో కూడా వెబ్సైట్లో లేదు. కానీ ఇలాంటి మోడల్ దేశానికి అవసరమంటూ కేసీఆర్ చెబుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.