Pensions Distribution : సామాజిక పింఛన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్. సెప్టెంబర్ నెలకు సంబంధించి పింఛన్ ఆగస్టు 31న అందించనున్నారు. ప్రతి నెలలో ఒకటో తేదీ పింఛన్ల పంపిణీ జరిగేది. కానీ సెప్టెంబర్ ఒకటి ఆదివారం కావడంతో.. ఒకరోజు ముందుగానే పింఛన్లు అందించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. శనివారం పింఛన్ల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాలని నిర్ణయించింది. దీంతో లబ్ధిదారుల్లో ఒక రకమైన ఆనందం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ మొత్తాన్ని మూడు వేల నుంచి 4 వేల రూపాయలకు పెంచిన సంగతి తెలిసిందే. అటు దివ్యాంగులతో పాటు దీర్ఘకాలిక రోగులకు సైతం పింఛన్ మొత్తం పెరిగింది. పెంచిన పింఛన్ మొత్తాన్ని గత రెండు నెలలుగా అమలు చేసింది కూటమి ప్రభుత్వం. సచివాలయ ఉద్యోగుల తో పాటు ప్రభుత్వ సిబ్బందితో ఇంటింటా పంపిణీ చేసింది. లబ్ధిదారుల్లో ఒక రకమైన ఆనందాన్ని నింపింది. ఈ తరుణంలో ఈ నెలకు సంబంధించి ముందుగానే మేల్కొంది. ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు ఉదయం పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది.ఎవరికైనా అందకుంటే సెప్టెంబర్ 2న సోమవారం అందించేందుకు నిర్ణయించింది.
* ఆ హామీ వెంటనే అమలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సామాజిక పింఛన్ మొత్తాన్ని 3000 నుంచి 4 వేల రూపాయలకు పెంచుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీకి తగ్గట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయగలిగారు. పెంచిన మొత్తాన్ని ఏప్రిల్ నుంచి అందించగలిగారు. దీంతో ప్రభుత్వం పై ఒక రకమైన సానుకూలత వ్యక్తం అయింది. చంద్రబాబు వచ్చిన ప్రతిసారి పింఛన్ మొత్తాన్ని పెంచుకుంటూ వచ్చారు. అందుకే పింఛన్ల పంపిణీని సైతం ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
* విజయవంతంగా పంపిణీ
వైసిపి హయాంలో వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేపట్టేవారు. కానీ ఎన్నికలకు ముందు వలంటీర్లను ఆ విధుల నుంచి తొలగించింది ఎన్నికల కమిషన్. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటా పింఛన్ల పంపిణీ ఎలా జరుగుతుంది? అని అంతా భావించారు.కానీ జూలై,ఆగస్టు నెలల్లో విజయవంతంగా పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు. తొలిరోజే 90 శాతానికి పైగా అందించగలిగారు. ఇప్పుడు అదే స్ఫూర్తిని కొనసాగించాలని భావిస్తున్నారు.
* రేపు అందించేందుకు నిర్ణయం
పింఛన్ల పంపిణీ ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చంద్రబాబు భావిస్తున్నారు.అందుకే సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో ఆరోజు పింఛన్ల పంపిణీ ప్రక్రియ ముందుకెళ్లే పరిస్థితి లేదు. అందుకే ఒక రోజు ముందుగానే పింఛన్లు అందించాలని నిర్ణయించారు. ఇంటింటా పింఛన్లను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే దీనిపై ప్రచారం జోరుగా సాగుతోంది. రేపు తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి సచివాలయ ఉద్యోగులకు, ప్రభుత్వ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి.