Raghu Ramakrishnam Raju : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత..గత ప్రభుత్వంలో జరిగిన లోపాలను బయట పెట్టే ప్రయత్నం చేస్తోంది.పెద్ద ఎత్తున సమీక్షలు చేస్తోంది.ఈ తరుణంలో అప్పటి పాలకులపై కేసులు కూడా నమోదు అవుతున్నాయి. అయితే మాజీ సీఎం జగన్ పై నమోదైన కేసు సంచలనం గా మారుతోంది.ఆయనకు విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రఘురామకృష్ణం రాజు పై గతంలో రాజ ద్రోహం కేసు పెట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాదులో ఉన్న ఆయనను సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చి మరి హింసించారు. అప్పట్లోనే తనపై దాడి జరిగినట్లు రఘురామకృష్ణం రాజు చెప్పుకొచ్చారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఆయన ఫిర్యాదుకు ప్రాధాన్యం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, రఘురామకృష్ణంరాజు టిడిపి ఎమ్మెల్యే కావడంతో.. తాజాగా ఆయన చేసిన ఫిర్యాదు పై పోలీసులు స్పందించారు. ఇద్దరు ఐపీఎస్ అధికారులతో పాటు జగన్ ను నిందితులుగా చేర్చారు. దీంతో మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ పై నమోదైన కేసు ఇదే కావడం గమనార్హం.
* అప్పట్లో రాజద్రోహం కేసు
2019 ఎన్నికల్లో రఘురామ కృష్ణంరాజు వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా గెలిచారు. గెలిచిన ఆరు నెలలకే అసంతృప్తి స్వరం వినిపించడం ప్రారంభించారు. పార్టీతో పాటు అధినేత తీరును తప్పుపడుతూ వ్యాఖ్యానించిన ప్రారంభించారు. ఈ క్రమంలో వైసిపి ప్రభుత్వ వైఫల్యాలతో పాటు జగన్ తీరును ఎండగట్టారు. ఈ క్రమంలోనే రఘురామకృష్ణం రాజు పై రాజ ద్రోహం కేసు నమోదయింది. అదే సమయంలో హైదరాబాదు నుంచి మంగళగిరి సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. విచారణ పేరిట తనపై చేయి చేసుకున్నారని అప్పట్లో రఘురామకృష్ణం రాజు ఆరోపించారు.
*తాజాగా ఫిర్యాదు
తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రఘురామకృష్ణం రాజు గుంటూరు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా కస్టడీలో దాడి చేశారని ఆరోపించారు. దీంతో మాజీ సీఎం జగన్ తో పాటు మాజీ సిఐడి బాస్ పివి సునీల్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు పై కేసు నమోదు అయింది. విచారణ కూడా ప్రారంభమైంది.
* ప్రాథమిక ఆధారాల సేకరణ
సీఎం జగన్ తో పాటు ఇద్దరు ఐపీఎస్ అధికారుల పాత్ర పై ప్రాథమిక ఆధారాలు సేకరించారు పోలీసులు. దీంతో వారిని విచారణకు రావాలని నోటీసులు జారీ చేయనున్నారు. ఇప్పటికే రఘురామయ్య పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి సిఐడి డిఎస్పి విజయ్ పాల్ కు నోటీసులు పంపారు. అప్పట్లో రఘురామరాజు అరెస్ట్, దాడిలో ఎవరెవరు పాత్ర ఉందన్నది పోలీసు విచారణలో తేలనుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ పై నమోదైన తొలి కేసుగా ఉండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.