AP Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వానలు దంచి కొడుతున్నాయి. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా తో పాటు విజయనగరంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. శ్రీకాకుళం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులకు అపార నష్టం కలిగింది. ఇప్పటికే వరి కోతలు జరుగుతుండగా ఈ వర్షం పడింది. దీంతో పొలంలో ఉన్న వరి చేలు తడిసి ముద్దవుతున్నాయి. నీటిలో నానిపోవడంతో మొలకలు వస్తున్నాయి. అదే సమయంలో కోతకు సిద్ధంగా ఉన్న చేను సైతం ఈదురు గాలులకు నేలవారుతోంది. దీంతో బురదలో ధాన్యం వంటి నష్టం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికి పంట అందుతున్న సమయంలో తుఫాన్ భారీ నష్టానికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వర్షం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఒకవేళ ధాన్యం రంగు మారిన కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేయాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. పొలాల్లో ఉన్న వరి పంట సురక్షితంగా ఉండేందుకు టార్పాలిన్లు అందిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్న ఎల్ దినకర్ పుడ్కర్ తెలిపారు.
* శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు
నిన్నటి నుంచి శ్రీకాకుళం జిల్లాలో భారీగా వర్షాలు పడుతున్నాయి. నిన్న ఒక్కరోజే 16.5 మిల్లీమీటర్ల వర్షం నమోదు అయినట్లు వాతావరణ శాఖ చెబుతోంది. లోతట్టు ప్రాంతాల్లో వర్షాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈదురు గాలుల ప్రభావంతో మత్స్యకారులు వేటకు దూరమయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో 193 కిలోమీటర్ల మేర తీరం విస్తరించి ఉంది. 11 మండలాల్లో వేలాదిమంది మత్స్యకారులు వేటకు దూరంగా ఉన్నారు. తుఫాను తీవ్రత తగ్గే వరకు వేటకు వెళ్ళొద్దని జిల్లా యంత్రాంగం ఆదేశించింది.
* విజయనగరంలోసైతం..
విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కొనసాగుతున్నాయి.గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా వరి కోతలు కొనసాగుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వర్షాలు పడుతుండడంతో రైతులకు నష్టం తప్పేలా లేదు. మరోవైపు జిల్లా కలెక్టర్ అంబేద్కర్ నేతృత్వంలో అధికారులు రంగంలోకి దిగారు. అన్ని మండలాల తహసీల్దారులతో పాటు ఇతర మండల స్థాయి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారు. మరోవైపు ఈ రెండు జిల్లాలకు రేపు కూడా భారీ వర్ష సూచన ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.