AP RAin Alert: ఏపీని( Andhra Pradesh) వర్షాలు వీడడం లేదు. గత కొద్ది రోజులుగా వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాలువల్లో సైతం జలకల సంతరించుకుంది. చెరువులతో పాటు కుంటల్లో కూడా భారీగా నీరు ఉంది. అయితే నైరుతి రుతుపవనాలు నిష్క్రమించాయి. ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. ఇటువంటి తరుణంలో ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాలు, వాయు గుండాలు ఏర్పడుతున్నాయి. ఈనెల 17న బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడింది. అల్పపీడనంగా మారింది. ఇది మరింత తీవ్ర రూపం దాల్చింది. గురువారం నాటికి తీవ్రవాయుగుండం గా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది.
* రెండు ప్రాంతాలపై ప్రభావం..
తీవ్ర వాయుగుండం గా మారితే కోస్తాతో పాటు రాయలసీమపై( Rayalaseema ) పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. దీని ప్రభావంతో వారం రోజులపాటు వర్షాలు కొనసాగనున్నాయి. నేడు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. అన్నమయ్య రాయచోటి, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం అయ్యింది. ఆయా జిల్లాలను మరింత అప్రమత్తం చేసింది.
* సముద్రం అల్లకల్లోలం..
తీవ్ర వాయుగుండం ఏర్పడిన సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళకూడదని సూచించింది. ఇప్పటికే వేటకు వెళ్లినవారు తిరిగి రావాలని కూడా కోరింది. వాయుగుండం తీరం దాటే సమయంలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. బలమైన ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, శిథిలావస్థలో ఉన్న గోడలు, ఇళ్లు, ఇతర భవనాల కింద నిల్చోకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.