AP Rain Alert: ఏపీలో( Andhra Pradesh) విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. ఒకవైపు ఎండలు మండుతున్నాయి. మరోవైపు వర్షాలు పడుతున్నాయి. మధ్యాహ్నం వరకు తీక్షణమైన ఎండ కాస్తోంది. సాయంత్రానికి ఉరుములతో కూడిన వర్షపు జల్లులు పడుతున్నాయి. గత కొద్దిరోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మరోవైపు కొన్ని జిల్లాల్లో అకాల వర్షం పడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగానే ఈ వర్షాలు పడుతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ నుంచి బిగ్ అలెర్ట్ వచ్చింది. వర్ష హెచ్చరికలు సైతం జారీ అయ్యాయి. అల్పపీడన ప్రభావంతోనే ఏపీలో పలు జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొద్దిరోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండగా.. మరో రెండు రోజుల పాటు వర్షాలు తప్పవని తేలింది.
Also Read: అమరావతి గెలిపిస్తుంది.. చంద్రబాబు ప్లాన్ అదే!
* వర్ష హెచ్చరిక..
అల్పపీడన ప్రభావంతో పార్వతీపురం మన్యం( parvatipuram manyam), అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఉభయగోదావరి, ప్రకాశం జిల్లా, నెల్లూరు, కడప జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తేల్చి చెప్పింది వాతావరణ శాఖ.
* పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
అయితే ఒకవైపు వర్షాలతో చల్లటి వాతావరణం కొనసాగుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లా ఉలిందకొండలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ప్రకాశం జిల్లా దరిమడుగులో 40.3, చిత్తూరు జిల్లా తవణం పల్లెలో 40.1, కడప జిల్లా జమ్మలమడుగు లో 39.9, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎర్రంపేటలో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. అయితే ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వైపు పొడి వాతావరణంతో కూడిన ఈదురుగాలులు వీస్తున్నాయి.
* స్థిరంగా అల్పపీడనం..
కాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో( Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో ఇది దిశ మార్చుకోనుంది. అనంతరం ఉత్తర, ఈశాన్య దిశగా తిరిగి బంగాళాఖాతంలోనే బలహీనపడుతుంది. దీని ప్రభావంతో ఈరోజు చాలా చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కాగా ఏపీలో అకాల వర్షాలతో పంటలకు నష్టం కలుగుతోంది. ఈదురుగాలులకు మామిడి పంట నేలకొరుగుతోంది. దీంతో రైతులకు నష్టాలు తప్పడం లేదు.