Ap politics : ఏపీలో ప్రతీకార రాజకీయాలు వద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పవన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రఘురామ కృష్ణంరాజు లాంటి వారు సైతం ఇకనుంచి జగన్ ను జగన్ గారు అని పిలుస్తానని చెప్పుకొచ్చారు. శాసనసభకు వచ్చిన జగన్ ను ఆప్యాయంగా పలకరించారు. ఎన్నికల ముందు వరకు రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చిన లోకేష్ సైతం ఇప్పుడు సైలెంట్ అయ్యారు. అయితే వైసీపీ నేతలు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. దాడులు, కేసులు తప్పవని భయపడుతున్నారు. ఏపీలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ తన పార్టీ శ్రేణులతో కలిసి ఏకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టారు. ఒకవైపు ప్రతీకార రాజకీయాలు వద్దని కూటమి ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేస్తున్నారు. ఇంకోవైపు వైసీపీ శ్రేణులు ఆందోళనతో గడుపుతున్నాయి. అయితే పరోక్షంగా కూటమి ప్రభుత్వం పావులు కదిపైన ఉండాలి. లేకుంటే వైసీపీ నేతలు అతి చేసైనా ఉండాలి. అధికారపక్షం విధ్వంస రాజకీయాలు చేయడం లేదని చెబుతోంది. విపక్ష వైసిపి మాత్రం రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చి మరి దాడులకు దిగుతున్నారని ఆరోపిస్తోంది. ప్రజలు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. పెద్దగా పట్టించుకోవడం లేదు.ఎవరు చెబుతున్నది నిజం అని కన్ఫ్యూజన్లో ఉన్నారు. అయితే ఎవరికి వారు రాజకీయం చేస్తున్నారన్నది మాత్రం నిజం. ఏపీలో రాజకీయ దాడులు జరగడం లేదని చెప్పలేము కానీ.. వైసిపి ఆరోపిస్తున్నంత రేంజ్ లో ఉన్నాయా? అంటే సమాధానం దొరకని పరిస్థితి.ఒక్కటి మాత్రం నిజం జాతీయస్థాయిలో ఏపీలో ఏదో జరుగుతోందన్న అనుమానం కలిగేలా చేయడంలో మాత్రం జగన్ సక్సెస్ అయ్యారు.
* ఐదేళ్ల విధ్వంసకర పాలన
గత ఐదు సంవత్సరాలుగా ఏపీలో విధ్వంసకర పాలన సాగిందని రుజువు చేయడంలో అప్పటి విపక్షాలు టిడిపి, జనసేన సక్సెస్ అయ్యాయి. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయి. వన్ చాన్స్ అని అవకాశం ఇస్తే.. జగన్ విధ్వంసకర పాలన సాగించారని విపక్షాలు ఆరోపణలు చేశాయి. అన్నింటికీ మించి వైసిపి ప్రజాప్రతినిధులు, నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడాన్ని మాత్రం ప్రజలు గుర్తించారు. అందుకే విపక్షాల ఆరోపణలను నమ్మి ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టారు. అయితే గత ఐదు సంవత్సరాలుగా రాజకీయంగా జగన్ సర్కార్ విపక్షాలను ఈ స్థాయిలో అణచివేసిందో తెలియంది కాదు. కానీ అదే మాదిరిగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తే ప్రజల్లో పలుచన కావడం ఖాయం.
* అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న కూటమి
‘వాత పెట్టాలి- వెన్న పూయాలి’ అన్న సూత్రాన్ని పాటిస్తున్నట్టు కనిపిస్తోంది కూటమి ప్రభుత్వం. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చేయాలని చంద్రబాబుతో పాటు పవన్ భావిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడుతున్నారు. వ్యవస్థలను ఎలా దారి మళ్లించారో.. ఏ స్థాయిలో అవినీతి చేశారో ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. శ్వేత పత్రాలు విడుదల చేసి ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాము ప్రతీకార రాజకీయాలు చేయమని చెబుతూనే.. వైసిపి పై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. విభిన్న ప్రకటనలు చేస్తున్నారు. శాసనసభ వేదికగా సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ప్రకటనలు చూస్తే..ఏ స్థాయిలో జాగ్రత్తగా మాట్లాడుతున్నారు అర్థమవుతుంది.
* ముందు జాగ్రత్త చర్యల్లో జగన్
కూటమి ప్రభుత్వం నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని జగన్ కు తెలుసు. గత ఐదు సంవత్సరాలుగా తాను అనుసరించిన విధానాలను.. తనపై ప్రయోగిస్తారని జగన్ అంచనా వేశారు. అయితే దానిని తిప్పి కొట్టాలని చూశారు. కానీ ప్రజలకు దొరకకుండా.. ఒక పద్ధతి ప్రకారం జగన్ తో పాటు వైసీపీ నేతలను వెంటాడాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే శాసనసభ తో పాటు బయట బాధ్యతగా మెలగాలని మూడు పార్టీల ఎమ్మెల్యేలకు చంద్రబాబుతో పాటు పవన్ హితబోధ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్లో వేరే అభిప్రాయం రాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.