Pawankalyan – Varahiyatra : ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి. ఎన్నికలకు పది నెలల ముందే సెగలు కక్కుతున్నాయి. అయితే ఇందుకు జనసేన అధినేత పవనే కారణం. వారాహి యాత్రతో ఏపీ పాలిటిక్స్ నే పవన్ ఒక్కసారిగా షేక్ చేశారు. ప్రత్యర్థుల ఫ్యూజులు, ఫిలమెంటులు జారిపోయేలా పదునైన అస్త్రాలతో విరుచుకుపడ్డారు. నీలిమీడియా, ఎల్లో మీడియా, కూలిమీడియాలను సైతం తనవైపు తిప్పుకున్నారు. వారు కళ్లార్పకుండా చూడాల్సిన అనివార్య పరిస్థితులను కల్పించారు. ప్రధాన ప్రత్యర్థితో సై అంటూ కలబడ్డారు. కలిసి నడిచి తనను తొక్కిపెడతామన్న వారికి హెచ్చరిక సంకేతాలు పంపారు. నా బలం ఇది అంటూ చెప్పకుండానే యాత్రకు వచ్చిన జనతాకిడిని చూపించారు.
వ్యవస్థాగత లోపాలపై పవన్ వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి. అభిమానులు ఆహ్వానిస్తారు.. ప్రత్యర్థులు వ్యతిరేకిస్తారు.. కానీ తటస్థులు మాత్రం పవన్ మాటలపై సీరియస్ గా దృష్టిసారిస్తున్నారు. పవన్ అన్నది నిజమే కదా? అన్న భావనకు వస్తున్నారు. ఏపీలో వలంటీర్ల పాత్రపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. వలంటీర్ల వెనుక ఇంత కథ ఉందా? అని సామాన్య జనాలు సైతం ఆరాతీస్తున్నారు. ఇప్పుడుఏ ఇద్దరు కలిసినా వలంటీర్ల ప్రస్తావనే. ఇన్నాళ్లు పింఛన్లు, ఇతర పథకాల గురించి వివరాలు సేకరిస్తున్నారని అంతా భావించారు. అయితే ఎప్పుడైతే వ్యక్తిగత సమాచారం, గోప్యంగా ఉండాల్సిన వివరాలు వారి ద్వారా బయటకు వెళుతున్నాయని పవన్ ఆరోపించడంతో ప్రజల అనుమానపు చూపులు ప్రారంభమయ్యాయి. తమ గ్రామంలో జరిగిన ఘటనలను ఉదహరించుకొని పవన్ చెప్పింది నిజమే కదా అన్న భావనకు వస్తున్నారు.
పవన్ వారాహి యాత్ర ఎవరికి కనువిప్పు అంటే అది ముమ్మాటికీ వైసీపీ నేతలకే. వారికి మైండ్ బ్లాక్ అయ్యింది. రోజుకో వ్యవస్థలో లోపాలపై కామెంట్స్ చేస్తుండడంతో వాటిని ఎలా తిప్పికొట్టాలో తెలియలేదు. వందీ మాగధులను తెచ్చి తిట్టించినా ప్రజల చెవుల్లోకి ఎక్కలేదు. పైగా గోదావరి జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగురకుండా చేస్తానని.. వైసీపీ విముక్త గోదావరి జిల్లాలే తన లక్ష్యమన్న స్లోగన్ ప్రజల్లోకి బలంగా వెళ్లింది. అధికార పార్టీని కలవరపాటుకు గురిచేసింది. రాష్ట్ర స్థాయిలో వైసీపీ నేతలు అడ్డగోలు విమర్శలు చేసినా.. వారాహి ప్రభంజనం చూసిన అధికార పార్టీ లోకల్ నాయకుల నోటి మాట రాలేదు.
తెలుగుదేశం పార్టీది ఇంకో రకం భయం. 12, 15, 20 సీట్లు ఇస్తామంటూ జనసేనను తేలిక చేశారు. అసలు పవన్ సాయం అవసరం లేకుండా గెలిచేస్తామని భ్రమించారు. ఒంటరిగా వెళ్లిన మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరవుతామని భావించారు. కానీ అంతా ఈజీ కాదని వారాహి యాత్రతో తేలిపోయింది. స్వచ్ఛందంగా వచ్చిన జనప్రభంజనాన్ని చూసి పవన్ సాయం అనివార్యమన్న నిర్ణయానికి వచ్చారు. పవన్ లేనిదే ఏపీలో అడుగు ముందుకు వేయలేమని భయపడుతున్నారు. మొత్తానికైతే ఏపీ రాజకీయాలను తన వారాహి యాత్రతో పవన్ సమూలంగా మార్చగలిగారు.