Viral Video : బహిరంగంగా మందు తాగుతున్నారా? జాగ్రత్త. గంజాయి సేవిస్తున్నారా? నేరుగా దొరికిపోతారు సుమ. ఏ మూల సేవిస్తున్నా ఇట్టే దొరికిపోతారు. డ్రోన్లు పట్టిస్తాయి కూడా. పోలీస్ శాఖలో డ్రోన్లు వచ్చాక తప్పు చేసేవారికి ముచ్చెమటలు పడుతున్నాయి. నిందితులను డ్రోన్ కెమెరాలు ఇట్టే పట్టిస్తున్నాయి. తాజాగా అనంతపురంలో డ్రోన్ కెమెరాలు హల్చల్ చేశాయి. బహిరంగ ప్రదేశాల్లో మందు తాగుతున్న వారికి పరుగులు పెట్టించాయి. అమరావతిని డ్రోన్ల హబ్ గా మారుస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. విజయవాడలో ఇటీవల అంతర్జాతీయ డ్రోన్ల సదస్సును కూడా నిర్వహించారు. విజయవాడ విపత్తు వేళ ఆహారం అందించేందుకు డ్రోన్ సహకారం తీసుకున్నారు. మనిషి దైనందిన జీవితంలో డ్రోన్ వినియోగం పెరగనుందని ప్రభుత్వం చెబుతోంది. డ్రోన్ల రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని కూడా చెప్పుకొస్తోంది. అందుకు తగ్గట్టుగానే అన్ని శాఖలు డ్రోన్ల సహకారాన్ని తీసుకుంటున్నాయి. అందులో భాగంగా పోలీస్ శాఖ కూడా డ్రోన్ కెమెరాల సహకారం తీసుకుంది. అనంతపురం పోలీసులు అయితే డ్రోన్లతో మందుబాబులను, జూదరులను పరుగులు పెట్టించడం విశేషం.
* ఆ ఫిర్యాదులతో
అనంతపురం శివారు ప్రాంతాల్లో మందుబాబులు, జూదరులు పెరిగినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో మందు తాగడం, గంజాయి సేవించడంతో తరచూ వివాదాలు జరుగుతున్నాయి. కొట్లాటలకు దారి తీస్తున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో పోలీసులకు సమస్యగా మారింది. అందుకే బహిరంగ ప్రదేశాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై పోలీసు శాఖ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా గురువారం శివారు ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో తనిఖీలు చేశారు పోలీసులు. దీంతో ఒక్కసారిగా మద్యం తాగుతున్నవారు.. జూదం ఆడుకున్నవారు పరుగులు తీశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వారిపై నాలుగు కేసులు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం ఈ డ్రోన్ల వేటకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
* పోలీస్ శాఖ డ్రోన్ల వాడకం
అయితే ఇటీవల పోలీస్ శాఖ డ్రోన్ల సేవలను వినియోగిస్తోంది. ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగు సమాచారం అందుకున్న పోలీసులు డ్రోన్ల సాయంతో గుర్తించారు. వెయ్యి గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. అటు విజయవాడ నగరంలో సైతం ట్రాఫిక్ రద్దీని డ్రోన్ల సాయంతోనే గుర్తిస్తున్నారు. మొత్తానికైతే పోలీస్ శాఖలో డ్రోన్లు పని భారాన్ని తగ్గిస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు.