ఏపీ ప్రభుత్వం( AP government ) సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ తో పాటు డీజిల్ ను 50 శాతం రాయితీపై( subsidy) అందించేందుకు సిద్ధపడింది. ప్రస్తుతం పెట్రోల్,డీజిల్ ధరలు అమాంతం పెరిగిన సంగతి తెలిసింది. గత కొన్నేళ్లుగా ఎన్డీఏ అధికారంలో ఉండగా చాలాసార్లు పెట్రోల్ డీజిల్, ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా… ఇండియాలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం విశేషం. దీనిపై రకరకాల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం భారీ రాయితీ ఇచ్చింది. అయితే ఇది అందరికీ కాదు. కేవలం దివ్యాంగులకు మాత్రమే. ఉపాధి రంగంలో ఉన్నవారికి, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారికి.. మూడు చక్రాల మోటరైజ్డ్ వాహనాలు ఉంటే ఈ రాయితీ వర్తించనుంది.
* వైసిపి హయాంలో అంతంతే దివ్యాంగులకు( physically handicapped) సంబంధించి మూడు చక్రాల వాహనాలకు గత ప్రభుత్వాలు రాయితీ అందిస్తూ వచ్చాయి. కానీ జగన్ సర్కార్ ఈ పథకాన్ని నిలిపివేసింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో ఈ పథకాన్ని పునరుద్ధరించింది. స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారు, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునేవారు.. మూడు చక్రాల వాహనాలు ఉంటే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన వారు మాత్రం అనర్హులు. ఈ విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ప్రస్తుతం ఏపీలో పెట్రోల్ ధర 110 రూపాయలు ఉంది. డీజిల్ ధర సైతం సమీపిస్తోంది. ప్రస్తుతం 98 రూపాయలు పలుకుతోంది.
* వాహన సామర్థ్యం బట్టి
అయితే ఈ వాహన సామర్థ్యం( vehicles strength ) బట్టి రాయితీ ఉంటుంది. 2 హెచ్పి వాహనం అయితే నెలకు 15 లీటర్లు, అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉంటే నెలకు 25 లీటర్ల వరకు రాయితీ పొందే అవకాశం ఉంటుంది. అది కూడా ఇంటి నుంచి పని ప్రదేశానికి మధ్య రాకపోకలకు మాత్రమే. ఎందుకుగాను ప్రభుత్వం 26 జిల్లాలకు లక్ష రూపాయల చొప్పున 26 లక్షలు కేటాయించింది. రాయితీ పొందాలనుకున్న లబ్ధిదారులు తప్పనిసరిగా పెట్రోల్ బంకుల నుంచి రసీదు తీసుకోవాలి. అయితే గతంలో వైసిపి హయాంలో రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల రూపాయలు ఈ రాయితీ కోసం కేటాయిస్తే.. ఖర్చు చేసింది సగభాగమే. కానీ ఇప్పుడు కూటమి సర్కార్ ఏకంగా 26 లక్షల రూపాయలు కేటాయించడం విశేషం.
* దరఖాస్తుల తో పాటు వీటిని జత చేయాలి
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా( State wise) అన్ని జిల్లాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. విభిన్న ప్రతిభావంతుల శాఖకు ఈ దరఖాస్తులు అందించాల్సి ఉంటుంది. దరఖాస్తులతో పాటు కొన్నిరకాల ధ్రువీకరణ పత్రాలు సైతం సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. పూర్తిచేసిన దరఖాస్తు ఫారం, వికలాంగుల సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బ్యాంక్ అకౌంట్ బుక్ ఫస్ట్ పేజీ, తెల్ల రేషన్ కార్డ్, ఆధార్ కార్డు, ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న ధ్రువీకరణ పత్రం, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పెట్రోల్/ డీజిల్ కొనుగోలు చేసిన బిల్లులు జత చేస్తే రాయితీ పథకానికి మీరు అర్హత సాధించినట్టే.