YS Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు. కొద్దిరోజుల కిందటే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరిట తెలంగాణలో రాజకీయ కార్యకలాపాలను ఆమె ప్రారంభించారు. కానీ అది వర్కవుట్ కాలేదు. అందుకే మొన్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. ఇటీవల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇప్పుడు పీసీసీ పగ్గాలు అందుకున్నారు. ఏపీ రాజకీయాలపై ఇది తప్పకుండా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె వైసీపీపై పోరుకు సిద్ధమై కాంగ్రెస్ లో చేరారని.. అన్నను ఢీకొట్టనున్నారని.. ఆమె రాకతో వైసిపి ఓట్లకు భారీగా గండి పడనుందని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.
జగనన్న వదిలిన బాణాన్ని నేను అంటూ షర్మిల ఆయన తరుపున పాదయాత్ర చేశారు. వైసిపి విజయానికి చివరి వరకు పోరాడారు. 2019లో జగన్ అధికార పీఠం ఎక్కే వరకు ఆయనకు అండగా నిలుస్తూ వచ్చారు. ఆ తరువాత అన్నతో వచ్చిన విభేదాలు కారణంగా తెలంగాణలో సొంత పార్టీని పెట్టుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఉన్నా ఏపీలో పాలనా వైఫల్యాలను ఎండగట్టారు. అటువంటి ఆమె ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ పగ్గాలు అందుకోవడంతో… జగన్ ప్రభుత్వాన్ని గట్టిగానే ప్రశ్నిస్తారని.. జగన్ కు రాజకీయ ఇబ్బందులు తప్పవని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నాయి.
ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ వర్గాలు వైసిపి కి అండగా నిలుస్తూ వచ్చాయి. గత ఎన్నికల్లో ఈ మూడు వర్గాలు వైసీపీకి మద్దతు తెలపడంతో ఏకపక్ష విజయం నమోదయ్యింది. అయితే కాంగ్రెస్ గూటికి షర్మిల చేరడంతో ఆ మూడు వర్గాల్లో చీలిక వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో ఎలాగైనా కాంగ్రెస్ ను బలోపేతం చేసి.. తన రాజకీయ భవిష్యత్తును మరింత పదిలం చేసుకోవాలని షర్మిల భావిస్తున్నారు. ఇప్పటికే ఆమె వివిధ కారణాలతో కాంగ్రెస్ కు దూరమైన నాయకులతో మాట్లాడుతున్నారు. పార్టీలో చేరాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పై అభిమానం ఉన్నా.. సరైన దిశ నిర్దేశం చేసే నాయకులు లేకపోవడంతో చాలామంది సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు షర్మిల రాకతో వారంతా క్రియాశీలకం అయ్యే అవకాశం ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా జగన్ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మూడు జాబితాలను ప్రకటించారు. 25 మంది ఎమ్మెల్యేలను మార్చారు. అందులో చాలామంది కాంగ్రెస్ పార్టీకి టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే షర్మిల వెంట నడుస్తానని ప్రకటించారు. కాపు రామచంద్రారెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి. వీరే కాక చాలామంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు షర్మిల వెంట నడిచే అవకాశం ఉంది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం, టిడిపి, జనసేనలోకి వెళ్లేందుకు వీలుపడని నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. షర్మిల కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కంకణం కట్టుకుంటే… దెబ్బతినేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.