AP Nominated Posts: ఏపీలో( Andhra Pradesh) టిడిపి కూటమి పాలన నడుస్తోంది. కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. రాజకీయ పరస్పర ప్రయోజనాలు పొందుతున్నాయి టిడిపి, బిజెపి. మరోవైపు జనసేనకు సైతం ఆ రెండు పార్టీలు ఎనలేని ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ తరుణంలో మూడు పార్టీలకు నామినేటెడ్ పదవులతో పాటు ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. కానీ జనసేనకు రాజ్యసభ స్థానం ఇంతవరకు లభించలేదు. వచ్చే ఏడాది రాజ్యసభలో జనసేన ఖాతా తెరిచే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఓ నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు కాగా.. ఒకరు టిడిపి ఎంపీ ఉన్నారు. ఈ నాలుగు ఎంపీ పదవులు ఖాళీ అవడంతో కూటమి పార్టీలు సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది.
* నలుగురు పదవీ విరమణ
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నుంచి గెలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని పదవీ విరమణ చేయనున్నారు. టిడిపి నుంచి సానా సతీష్ పదవి పూర్తి కానుంది. అయితే సతీష్ మొన్ననే రాజ్యసభ సభ్యుడిగా ప్రమోట్ అయ్యారు. అది మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన స్థానం. దాదాపు ఏడాది కాలం మాత్రమే ఆ పదవికి గడువు ఉండగా సనా సతీష్ ని ఎంపిక చేశారు. ఇప్పుడు ఆయన కూడా పదవి విరమణ చేస్తారు. మొత్తం నాలుగు రాజ్యసభ పదవులు ఖాళీ కావడంతో కూటమి పార్టీల నుంచి విపరీతమైన పోటీ ఉంటుంది.
* గల్లా జయదేవ్ పేరు..
మొత్తం నాలుగు పదవుల్లో రెండు టిడిపికి, ఒకటి బిజెపికి, మరొకటి జనసేనకు దక్కే అవకాశం ఉంది. టిడిపికి సంబంధించి కీలక నేత. ఆయనకు పదవి ఇచ్చి ఏడాది అవుతున్న క్రమంలో మరోసారి రెన్యువల్ ఖాయం. అయితే మిగిలిన ఒక రాజ్యసభ పదవికి విపరీతమైన పోటీ ఉంది. ప్రధానంగా గల్లా జయదేవ్ పేరు వినిపిస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు గల్లా జయదేవ్. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. మొన్న ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఎంపీగా గెలిచి ఉంటే కేంద్రమంత్రి కావడం ఖాయం. ఆయన స్థానంలో పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. క్రియాశీలక రాజకీయాలకు దూరమైన గల్లా జయదేవ్ టిడిపి తో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. రాజ్యసభకు ఎంపిక కావడం ద్వారా మరోసారి పార్లమెంట్లో అడుగు పెట్టాలని భావిస్తున్నారు.
* సీనియర్ నేత కావడంతో..
మరోవైపు పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తన సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని రాజ్యసభ పదవి కోరుతున్నారు. కొద్ది రోజుల కిందట ఆయన ఎమ్మెల్సీగా పదవి విరమణ చేశారు. ఆయన పేరు గవర్నర్ పోస్ట్ కు వినిపించింది. కానీ ఆ పదవి అశోక్ గజపతి రాజుకు వరించింది. చంద్రబాబుకు సమకాలీకుడు యనమల రామకృష్ణుడు. 1995 టీడీపీ సంక్షోభ సమయంలో స్పీకర్ గా ఉండేవారు. అప్పటినుంచి చంద్రబాబుకు నమ్మకమైన నేతగా ఉంటూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి యనమల రామకృష్ణుడుకు మంత్రి పదవి దక్కేది. 2014లో ఎమ్మెల్సీగా ఉన్న అయ్యన్నపాత్రుడుకు మంత్రిగా అవకాశం ఇచ్చారు చంద్రబాబు. కానీ ఈసారి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఎమ్మెల్సీగా ఉన్న యనమల పదవీ విరమణ చేసిన కొనసాగింపు దక్కలేదు. అయితే తనకు పెద్దల సభకు వెళ్లాలని ఉందని యనమల రామకృష్ణుడు పలుమార్లు వెల్లడించిన నేపథ్యంలో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
* ఆ ఇద్దరు సైతం..
తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ స్థానాలు ఆశిస్తున్న చాలామంది నేతలు ఇంకా ఉన్నారు. ప్రధానంగా పార్టీ కష్ట కాలంలో ఉన్న అధినేత చంద్రబాబు వెంట నడిచే నేతల్లో కంభంపాటి రామ్మోహన్ రావు ఒకరు. గతంలో ఆయనకు టిడిపి పలుమార్లు రాజ్యసభ పదవి ఇచ్చింది. ఈసారి కూడా ఆయన పదవిని కోరుకుంటున్నారు. మరోవైపు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ సైతం రాజ్యసభ రేసులో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా బాధ్యతను చూసేవారు విజయ్. అయితే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని అయ్యన్నపాత్రుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అయితే రాజ్యసభ పదవి ఆశిస్తున్నారు విజయ్. లేకుంటే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలని కూడా చూస్తున్నారు. సో టీడీపీలో ఒక పదవి కోసం విపరీతమైన పోటీ కనిపిస్తుండడం విశేషం.