AP News : ఏపీ పదో తరగతి ఫలితాల్లో ఇద్దరు బాలికలకు విచిత్ర పరిస్థితి ఎదురయింది. ఐదు సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించిన వారు.. ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు. అయితే రీవాల్యుయేషన్ కోరిన తర్వాత అదే సబ్జెక్టులో భారీగా మార్కులు వచ్చాయి. అయితే ఇంతలో వారికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ట్రిపుల్ ఐటి ప్రవేశాలకు అవకాశం లేకుండా పోయింది. దరఖాస్తు గడువు సమయం ముగియడంతో వారు ట్రిపుల్ ఐటీ కి అర్హత సాధించలేకపోయారు. కొద్ది రోజుల కిందట పదో తరగతి ఫలితాలు ప్రకటించారు. ఉత్తీర్ణత సాధించని వారికోసం సప్లమెంటరీ పరీక్షలకు అవకాశం ఇచ్చారు. అయితే ఇంతలో రీవాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకోవడంతో.. వారి ఫలితాలను వెల్లడించారు. మంచి మార్కులే సాధించారు.
* ట్రిపుల్ ఐటీ కి అవకాశం లేకుండా..
బాపట్ల జిల్లా కొల్లూరు జడ్పీ హైస్కూల్ కు చెందిన విద్యార్థిని తేజస్వినికి ఐదు సబ్జెక్టుల్లో 90 కి పైగా మార్కులు వచ్చాయి. కానీ సోషల్ సబ్జెక్టులో మాత్రం 23 మార్కులు రావడంతో ఆమె ఫెయిల్ అయ్యింది. వెంటనే రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకుంది. ఫెయిల్ అయిన సోషల్ సబ్జెక్టులో 96 మార్కులు సాధించింది. ఇప్పుడు ఆమె సాధించిన మొత్తం మార్కులు 575కు చేరాయి. తేజస్విని తండ్రి కూలి పనులు చేస్తూ తన కూతురిని చదివిస్తున్నాడు. ట్రిపుల్ ఐటీ లో సీటు వస్తుందని ఆశించారు. త్రిబుల్ ఐటీ కి దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 20తో గడువు ముగిసింది. ఆ గడువు దాటిపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమకు ఒక అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
* మార్కులు లెక్కించడంలో తప్పిదం..
వైయస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన గంగిరెడ్డి మోక్షిత అనే విద్యార్థినికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. పదో తరగతి ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లో ఆ బాలిక సత్తా చాటింది. సోషల్ లో మాత్రం 21 మార్కులు రావడంతో ఫెయిల్ అయింది. అయితే ఇప్పుడు రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోగా.. ఆమెకు 84 మార్కులు వచ్చాయి. ఆమె సైతం ట్రిపుల్ ఐటీ సీటు ఆశించారు. దరఖాస్తు గడువు ముగియడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పాట్ వాల్యూషన్ లో, మార్కుల జాబితా రూపొందించడంలో పొరపాటు జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. మొత్తం నాలుగు భాగాలుగా విభజించిన మార్కుల జాబితాలో.. మూడింటిని వదిలేసి.. ఒక భాగంలో లెక్కించడం వల్లే ఆ మార్కులు వచ్చాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఫలితాల్లో వారికి అన్యాయం జరిగింది. కానీ రీవాల్యుయేషన్ తో వారికి న్యాయం జరిగింది. అయితే ట్రిపుల్ ఐటి కి అర్హత కోల్పోవడం వారికి శాపం గా మారింది.