AP New Universities
AP New Universities: ఏపీ ప్రభుత్వం( AP government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు మంత్రి నారా లోకేష్. ముఖ్యంగా విశాఖలో ఏఐ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. అదే సమయంలో అమరావతిలో డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. గత కొద్దిరోజులుగా యూనివర్సిటీల ఏర్పాటు విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. అందుకే త్వరగా ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
* అమరావతిలో ప్రతిష్టాత్మకంగా..
అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణ పనులు ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో ప్రధాని మోదీ పనులు పునః ప్రారంభించనున్నారు. అదే సమయంలో ఇతర సంస్థల నిర్మాణం పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే అమరావతిలో డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఐఐటి మద్రాస్, టోక్యో యూనివర్సిటీ, ఎల్ అండ్ టి సంస్థల సహకారంతో అమరావతి ప్రాంతంలో యూనివర్సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.
* విశాఖలో ఏఐ యూనివర్సిటీ
ఏపీ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్( artificial intelligence ) రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆ రంగానికి సంబంధించి విశాఖలో ఏఐ యూనివర్సిటీ నెలకొల్పే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నారా లోకేష్ ఈ విషయంలో పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చారు. ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ చట్ట సవరణ బిల్లును నారా లోకేష్ మంగళవారం ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మొత్తానికి అయితే ఏపీలో యూనివర్సిటీల ఏర్పాటు విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చింది.