AP MLC Election: ఏపీలో మరో ఎన్నిక.. కూటమికి గట్టి సవాల్.. వైసీపీ నుంచి మాజీ మంత్రులు!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల రాజకీయ వేడి ఇంకా తగ్గలేదు. అప్పుడే మరో ఎన్నికకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాజకీయ వేడి ప్రారంభమైంది. కూటమికి తొలి సవాల్ చేస్తోంది వైసిపి.

Written By: Dharma, Updated On : July 31, 2024 5:05 pm

AP MLC Election

Follow us on

AP MLC Election: ఏపీలో మరో ఎన్నికకు తెరలేచింది. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. విశాఖ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి హరేందిర ప్రసాద్ షెడ్యూల్ విడుదల చేశారు. ఆగస్టు 6న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆ రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఆగస్టు 30న పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ మూడున ఓట్ల లెక్కింపు ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులవుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నిక ఎదురయ్యింది. వాస్తవానికి స్థానిక సంస్థల్లో వైసీపీకి స్పష్టమైన బలం ఉంది. కానీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమితో స్థానిక సంస్థల ప్రతినిధులు నిరాశకు గురయ్యారు. పార్టీకి ఇక భవిష్యత్తు లేదని భావిస్తున్న వారు కూటమి పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే ఎన్నికలకు ముందు చాలామంది స్థానిక సంస్థల ప్రతినిధులు టిడిపి, జనసేనలో చేరారు. ఎన్నికల తరువాత సైతం చాలామంది చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ విశాఖ తో పాటు అనకాపల్లి, నర్సీపట్నం, భీమిలి మున్సిపాలిటీల నుంచి భారీగా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూటమి పార్టీలోకి దూకేందుకు యత్నించారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో 12 మంది కార్పొరేటర్లు టిడిపి, జనసేనలో చేరారు. మరికొందరు చేరేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు. దిగువ స్థాయిలో ఎంపీటీసీలు, జడ్పిటిసిలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.పైకి వైసిపి బలంగా కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం ఆ పార్టీకి భయం వెంటాడుతోంది. దీంతో పోటీ చేసేందుకు వైసిపి నేతలు ముందుకు రాని పరిస్థితి.

* వైసీపీకి స్పష్టమైన మెజారిటీ
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, అనకాపల్లి, నర్సీపట్నం, భీమిలి మున్సిపాలిటీలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు ఓట్లు ఉన్నాయి. విశాఖ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీలు, జడ్పిటిసిలు సైతం ఓటు వేయనున్నారు. మొత్తం 841 ఓట్లు ఉండగా.. వైసీపీ మద్దతుదారులు 615 మంది ఉన్నారు. టిడిపి,జనసేన, బిజెపి కూటమికి 215 ఓట్లు ఉన్నట్లు తెలుస్తోంది. మరో పదకొండు చోట్ల పదవులు ఖాళీగా ఉన్నాయి.అయితే ఇప్పటికే ఎన్నికలకు ముందు చాలామంది స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీలు మారారు. ఎన్నికల తరువాత కూడా అధికార పార్టీకి జై కొట్టారు. దీంతో అధికార పార్టీకే స్థానిక ప్రజా ప్రతినిధులు జై కొడతారని తెలుస్తోంది.

* అధికార పార్టీ దూకుడు
ప్రస్తుతం ఉన్న బలాబలాలను చూస్తే వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. కానీ అధికార పార్టీ దూకుడు మీద ఉండడంతో వైసీపీలో ఆందోళన కనిపిస్తోంది. టిడిపి తరఫున మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బాబ్జి విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. కానీ పొత్తులో భాగంగా ఆ సీటు జనసేన పార్టీకి కేటాయించారు. అక్కడ నుంచి వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ యాదవ్ జనసేనలోకి ఫిరాయించడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. అందుకే ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది. టిడిపి తరఫున దాదాపు గండి బాబ్జి పేరు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది.

* తెరపైకి వారిద్దరి పేర్లు
వైసిపి బలమైన అభ్యర్థిని బరిలో దించే పనిలో పడింది. ముఖ్యంగా తాజా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తాజాగా మంత్రి పదవులు చేసి ఉండడంతో వారైతే మంచి అభ్యర్థులు అవుతారని హై కమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే వైసిపి ఓడిపోయిన తర్వాత విశాఖ జిల్లాలో నాయకులు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఒక్క గుడివాడ అమర్నాథ్ మాత్రమే తరచూ మీడియా ముందుకు వస్తున్నారు. మిగతావారు ముఖం చాటేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికలంటే ఏ స్థాయిలో అధికార పార్టీ దూకుడుగా వ్యవహరిస్తుందో తెలియంది కాదు. అందుకే అయిష్టంగానే అమర్నాథ్ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే సార్వత్రిక ఎన్నికల తర్వాత.. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హీట్ పుట్టిస్తోంది.