Andhra Pradesh Local Body Elections: ఏపీలో( Andhra Pradesh) స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్ వచ్చింది. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ఇప్పటికే మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం గడువు ముగిసింది. ప్రత్యేక అధికారుల నియామకం జరిగింది. ఏప్రిల్ 2 తో పంచాయితీ పాలకవర్గాల గడువు ముగియనుంది. జూన్లో మండల పరిషత్, జిల్లా పరిషత్తుల పదవీకాలం ముగియనుంది. అయితే వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని చూస్తున్నారు సీఎం చంద్రబాబు. చంద్రబాబు చెబుతున్న మాదిరిగా చూస్తే ఆగస్టులోగా మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలన్న ఆలోచన కనిపిస్తోంది. అయితే ముందుగా పంచాయతీలకు నిర్వహిస్తారా? మున్సిపల్ ఎన్నికలకు వెళ్తారా? అనేది చూడాలి. అయితే పంచాయితీ ఎన్నికలకు మొగ్గు చూపుతారని తెలుస్తోంది.
Also Read: రేవంత్ రెడ్డి మూడు ముక్కలాట..!
* క్యాబినెట్ భేటీలో ఆదేశం..
నిన్ననే ఏపీ క్యాబినెట్ సమావేశం( AP Cabinet meeting ) జరిగిన సంగతి తెలిసిందే. ఆరు నెలల్లోగా మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేసే ఆలోచనతో ఉన్నామని.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రులకు సీఎం చంద్రబాబు నిర్దేశించారు. ఏ ఎన్నికలు వచ్చినా కూటమి జెండా ఎగుర వేసేలా.. ఇప్పటినుంచి పావులు కదపాలని కూడా ఆయన సూచించారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉందని స్పష్టం అవుతోంది. 2021 మార్చిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. తర్వాత మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. చివరిగా ప్రాదేశిక ఎన్నికలు జరిగాయి. అయితే ఇప్పుడు పాలకవర్గాల గడువు ముగుస్తుండడంతో ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రం పరిస్థితి గాడిన పడిన దృష్ట్యా స్థానిక సంస్థల ప్రతినిధులు వస్తే మరింత దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నట్లు సమాచారం.
* కూటమి నేతల ఎదురుచూపు.. తెలుగుదేశం( Telugu Desam) కూటమికి సంబంధించి స్థానిక నేతలు ఎక్కువగా ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కూటమి పట్ల ప్రజల్లో సానుకూలత ఉన్నందున.. వీలైనంత త్వరగా ఎన్నికలు పూర్తి చేస్తే ఏకపక్ష విజయం సాధించవచ్చు అని భావిస్తున్నారు. పైగా మూడు పార్టీల మధ్య చక్కటి సమన్వయం ఉంది. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తే కూటమి సజావుగా ముందుకు సాగే అవకాశం ఉంది. సాధారణంగా పంచాయతీ సర్పంచులు అనేసరికి రాజకీయాలకు అతీతంగా ఉంటారు. దానికి పెద్దగా పార్టీ ముద్ర ఉండదు. కానీ మున్సిపల్ ఎన్నికలతో పాటు పరిషత్ ఎన్నికలకు మాత్రం.. పార్టీ గుర్తుతో జరుగుతాయి. వాటికి విపరీతమైన పోటీ ఉంటుంది. అందుకే పార్టీ గుర్తుతో ప్రమేయం లేని పంచాయితీ ఎన్నికలను పూర్తి చేయాలని చూస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రస్తుతం రిజర్వేషన్లకు సంబంధించి ఏకసభ్య కమిషన్ నియామకం జరిగింది. అది నివేదిక ఇవ్వనుంది. ఓటరు జాబితా ప్రదర్శన కూడా పూర్తయింది. తాజాగా సీఎం చంద్రబాబు ప్రకటనతో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైనట్టే.
