AP Liquor Case: ఏపీలో( Andhra Pradesh) మద్యం కుంభకోణం సంచలనంగా మారింది. రాజ్ కసిరెడ్డి సూత్రధారిగా ఏపీలో మద్యం కుంభకోణం జరిగినట్లు కూటమి ప్రభుత్వం అనుమానించింది. అందుకే ప్రధాన సూత్రధారిగా భావించి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అరెస్టు చేసింది. అయితే ఇన్ని రోజులు విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న రాజ్ కసిరెడ్డిని రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన విచారణలో ఆసక్తికర అంశాలను బయటపెట్టినట్లు సమాచారం. రిమాండ్ రిపోర్టులో సైతం ప్రముఖుల ప్రమేయం గురించి ప్రస్తావన ఉంది. కసిరెడ్డి ముడుపుల డబ్బులను జగన్ ఓఎస్డీకి ఇచ్చినట్లు అంగీకరించారు. మరోవైపు ఈ కేసులో ఏ4 గా ఎంపీ మిధున్ రెడ్డి, ఏ 5 గా విజయసాయిరెడ్డిని చేర్చారు. మొత్తం 3200 కోట్ల రూపాయలు దోపిడీ జరిగినట్లు అంచనాకు వచ్చారు. అయితే ఈ కేసులో అరెస్టు అయిన రాజ్ కసిరెడ్డికి కోర్టు రిమాండ్ విధించడంతో విజయవాడ జైలుకు తరలించారు.
Also Read: అటు వైసిపి.. ఇటు టిడిపి.. ఏకకాలంలో విజయసాయిరెడ్డి టార్గెట్
* సంచలన అంశాలు వెలుగులోకి..
అయితే రాజ్ కసిరెడ్డి( Raj kasireddy ) విచారణలో సంచలన విషయాలను బయటపెట్టినట్లు తెలుస్తోంది. అప్పటి సీఎం జగన్ ఆదేశాలను అనుసరించి తాను నడుచుకున్నట్లు వివరించారు. మిధున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వాసుదేవ రెడ్డి కలిసి మద్యం నుంచి ముడుపులు పిండుకునేలా కార్యాచరణ సిద్ధం చేశామని చెప్పుకొచ్చారు. జగన్ కార్యదర్శిగా ఉన్న ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి తో పాటు పలువురికి ఇందులో పాత్ర ఉందని రాజ్ కసిరెడ్డి అంగీకరించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ వెల్లడించింది. ఈ సందర్భంగా రిమాండ్ రిపోర్టులో ఉన్న అనేక కీలక విషయాలను బయటపెట్టింది.
* గత రెండు రోజులుగా విచారణ..
రెండు రోజుల కిందట ఎయిర్పోర్టులో రాజ్ కసిరెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం( special investigation team) అదుపులోకి తీసుకుంది. విజయవాడ తీసుకొచ్చి విచారణ ప్రారంభించింది. ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో ఆయనను ప్రశ్నించామని.. నేరం, దాని వెనుక ఉన్న కుట్ర, తన పాత్ర, ఇతరుల భాగస్వామ్యం పై అన్ని అంశాలు అంగీకరించిన రాజ్ కసిరెడ్డి.. చివరకు నేర అంగీకార పత్రం పై సంతకం చేసేందుకు నిరాకరించినట్లు సిట్ పేర్కొంది. అయితే మొత్తం ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరి పేరును రాజ్ కసిరెడ్డి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్న రాజ్ కసిరెడ్డి హైదరాబాద్ వేదికగానే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపినట్లు తేలడం సంచలనం గా మారింది.
* పార్టీకి ప్రయోజనం కలిగించేలా పాలసీ..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి, నేతలకు ప్రయోజనం కలిగేలా మద్యం పాలసీపై వర్కౌట్ చేసే బాధ్యతను అప్పటి సీఎం జగన్ తనకు అప్పగించినట్లు రాజ్ కసిరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ పాలసీ ద్వారా పార్టీకి ఫండింగ్ రావడంతో పాటు పథకాల అమలుకు ఆదాయం సమకూరాలని నిర్దేశించినట్లు విచారణలో రాజ్ కసిరెడ్డి చెప్పుకొచ్చారు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిక్కర్ షాపులు ఏర్పాటు చేసి.. మద్యం వ్యాపారం చేసేలా కొత్త పాలసీని రూపొందించినట్లు విచారణలో చెప్పారు. అయితే ఈ మొత్తం ప్రణాళికను అమలు చేసే బాధ్యతను అసిస్టెంట్ సెక్రెటరీగా ఉన్న సత్యప్రసాద్ కు అప్పగించామని వివరించారు. మద్యం ముడుపుల కుట్రకు హైదరాబాదులో విజయసాయిరెడ్డి ఇంట్లోనే ప్లాన్ చేసినట్లు అంగీకరించారు. ప్రతి మద్యం సీసా నుంచి భారీగా కమిషన్ వచ్చేలా మద్యం పాలసీని ఫిక్స్ చేశామని రాజ్ కసిరెడ్డి చెప్పగా.. ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది.
* మొత్తం 29 మంది నిందితులు..
మొత్తం 29 మంది నిందితులుగా ఈ మద్యం కుంభకోణంలో రిమాండ్ రిపోర్టును( remand report ) రూపొందించింది ప్రత్యేక దర్యాప్తు బృందం. ఏ1 గా రాజ్ కసిరెడ్డి, ఏ 4గా ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, ఏ 5 గా విజయసాయిరెడ్డిని పేర్కొన్నారు. అయితే అప్పటి సీఎం జగన్ చెబితేనే తాను చేశానని రాజ్ కసిరెడ్డి వెల్లడించారు. కానీ నిందితుల జాబితాలో జగన్మోహన్ రెడ్డి పేరు లేకపోవడం విశేషం. మొత్తానికైతే రాజ్ కసిరెడ్డి విచారణలో చెప్పిన అంశాలను రిమాండ్ రిపోర్టులో పొందుపరిచింది సిట్. ఇప్పుడు ఈ రిమాండ్ రిపోర్ట్ సంచలనంగా మారింది.