AP SSC Results 2025: ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh) పదో తరగతి ఫలితాల్లో రికార్డు స్థాయిలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో అనేక రికార్డులు నమోదు అయ్యాయి గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 600 మార్కులు పొందింది ఓ విద్యార్థి. అదే సమయంలో ఓ జిల్లాకు చెందిన విద్యార్థి ఒకే ఒక్క మార్కుతో రికార్డ్ సృష్టించాడు. అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిన సదరు విద్యార్థి ఒక సబ్జెక్టులో మాత్రం ఒక్క మార్కు తెచ్చుకున్నాడు. పదోతరగతి ఫలితాలను ఈరోజు ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. అయితే బాలురు కంటే బాలికలు అధిక శాతం లో ఉత్తీర్ణత సాధించారు.
Also Read: అటు వైసిపి.. ఇటు టిడిపి.. ఏకకాలంలో విజయసాయిరెడ్డి టార్గెట్!
* సరికొత్త రికార్డు
తూర్పుగోదావరి జిల్లా( East Godavari district) కాకినాడకు చెందిన నేహాంజని( Neha Anjani ) అనే బాలిక 600కు 600 మార్కులు సాధించింది. స్థానిక భాష్యం పాఠశాలలో చదువుతున్న నేహాంజని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. దీంతో ఆ విద్యార్థినిపై సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఉమ్మడి విశాఖ జిల్లా ఎలమంచిలి లోని ఎండ అనిత అనే విద్యార్థిని 599 మార్కులు సాధించింది. అదేవిధంగా పలనాడు జిల్లా జడ్పిచర్ల జడ్పీ హైస్కూల్ కు చెందిన పావని చంద్రికకు 598 మార్కులు వచ్చాయి. దీంతో ఆమెను హెచ్ఎం విజయ లలిత, తోటి ఉపాధ్యాయులు అభినందించారు.
* సత్తా చాటిన బాలికలు..
రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి ఫలితాల్లో( 10th class results ) బాలికలు సత్తా చాటారు. మొత్తం ఫలితాల్లో 81.14% ఉత్తీర్ణత నమోదయింది. వీరిలో బాలురు 78.31%, బాలికలు 84.09% ఉత్తీర్ణులయ్యారు. 1680 పాఠశాలల్లో శత శాతం ఉత్తీర్ణత నమోదయింది. 19 పాఠశాలల్లో 0% ఉత్తీర్ణత నమోదు అయింది. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 93.90% ఉత్తీర్ణత నమోదయింది. మే 19 నుంచి 28 వరకు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
* ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన ఉత్తీర్ణత..
మరోవైపు ఈ విద్యా సంవత్సరానికి ( academic year ) ఇదే చివరి పని దినం. ఇదే రోజు పదో తరగతి ఫలితాలు విడుదల కావడంతో ప్రతి పాఠశాలల్లో సందడి నెలకొంది. మరోవైపు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం గతంకంటే పెరిగింది. ఈసారి రికార్డు స్థాయిలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అత్యధిక మార్కులు పొందారు. దీంతో ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక పెరుగుతుందని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 16 వేల మందికి పైగా ఉపాధ్యాయులు వచ్చే విద్యా సంవత్సరానికి భర్తీ కానున్నారు. మొత్తానికైతే పాఠశాల విద్యాశాఖకు ఇది శుభ పరిణామం.