https://oktelugu.com/

Krishna District: ఒక్క ఈఎంఐ 12వేలు.. ఆ ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణం తీశాయి..

ఇవన్నీ ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని తల్లి చెప్పింది. తల్లి మాట్లాడుతుండగానే జీవన్‌ ఫోన్‌ కట్‌ చేశాడు. తరువాత అఘాయిత్యానికి పాల్పడ్డాడు. క్షణికావేశంతోనే జీవన్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు నిర్థారణకు వచ్చారు. 

Written By:
  • Dharma
  • , Updated On : May 11, 2023 / 03:57 PM IST
    Follow us on

    Krishna District: చిన్నపాటి సమస్యలను కొందరు తట్టుకోలేకపోతున్నారు. క్షణికావేశంతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కుటుంబసభ్యులకు అంతులేని విషాదాన్ని మిగుల్చుతున్నారు. తాజాగా విజయవాడలో ఇటువంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. హత్య కోణంలో దర్యాప్తుచేసిన పోలీసులకు ఆసక్తికర విషయాలు తెలిశాయి. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాక శివారులో జమ్మలమూడి జీవన్ (20) అనే ఇంజనీరింగ్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. 90 శాతం కాలిన గాయాలతో మృతదేహం గుర్గుపట్టలేని విధంగా మారింది. చివరకు పోలీసులు మృతదేహం జీవన్ దిగా తేల్చారు.

    చిన్నపాటి వివాదం..
    విజయవాడ క్రీస్తురాజపురానికి చెందిన జమ్మలమూడి జీవన్‌ (20) కొత్తపేటలోని పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి సుధాకర్‌ ఓ హోటల్‌ వద్ద వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. తల్లి ఇంటివద్దనే ఉంటుంది. తండ్రి ఈఎంఐ కట్టేందుకు రూ.12 వేలు ఇవ్వగా జీవన్ సొంతానికి ఖర్చుపెట్టుకున్నాడు. దీంతో తండ్రి మందలించాడు. అప్పటి నుంచి ఇంటికి వెళ్లకుండా స్నేహితులతో తిరుగుతున్నాడు. మంగళవారం ఉదయం ఇంటికి వెళ్లాడు. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో స్నేహితుడు శ్యామ్‌ పుట్టినరోజు పార్టీ ఉందని తల్లితో చెప్పి బయటకు వచ్చాడు. క్రీస్తురాజపురానికి చెందిన ఐదుగురు స్నేహితులతో కలిసి విజయవాడ గురునానక్‌ కాలనీలో ఉన్న అవర్‌ ప్యాలస్‌లో ఓయో రూంకు వెళ్లి స్నేహితుడికి కేట్‌కట్‌ చేసి సరదాగా గడిపారు. అవర్‌ ప్యాలస్‌లో జీవన్‌ స్నేహితుడు రాజమండ్రి సాయి… బాయ్‌గా పనిచేస్తున్నాడు. రాత్రి పది గంటల సమయంలో సాయికి చెందిన స్కూటీ తీసుకుని ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి హోటల్‌ నుంచి బయటకు వచ్చాడు.

    పెట్రోల్ పోసుకొని..
    అయితే జీవన్ ఎంతకీ రాకపోవడంతో సాయి నిద్రకు ఉపక్రమించాడు. ఆ సమయంలోనే జీవన్ ఇన్ స్టాలో ‘దిస్ ఈజ్ మైలాస్ట్ డే’ అన్న పోస్టు వచ్చింది. అయితే దీనిని సాయి లైట్ తీసుకున్నాడు. చనువుతో బూతు పదంతో రిప్లయ్ ఇచ్చాడు. ‘చూద్దుగాని రాత్రికి ఏం జరుగుతుందో’ అని జీవన్ దానికి బదులిచ్చాడు. అయితే అప్పటికే జీవన్ ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాడు. స్నేహితుడి బండితో యనమలకుదురు శివాలయం ఎదురుగా ఉన్న బంక్ లో సీసాలో పెట్రోల్ కొనుగోలు చేశాడు.పెదపులిపాక శివారులో ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు. 90 శాతం కాలిపోవడంతో ఘటనాస్థలంలోనే మృతిచెందాడు.

    హత్య కోణంలో విచారణ..
    అయితే బుధవారం ఉదయం అటువైపుగా వచ్చిన రైతులు పోలీసులకు సమాచారమందించారు. తొలుత అది హత్యగా భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. అయితే అఘాయిత్యానికి పాల్పడక ముందే జీవన్ తల్లిదండ్రులతో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. ముందుగా  తండ్రి సుధాకర్‌కు ఫోన్‌ చేశాడు. తండ్రి ఈఎంఐ చెల్లించమని ఇచ్చిన రూ.12 వేలను ఖర్చు చేశానని చెప్పాడు. తన వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పి, ఫోన్‌ను తల్లికి ఇవ్వమని చెప్పాడు. తల్లితో కాసేపు మాట్లాడాడు. తండ్రి ఆరోగ్యం బాగోకపోవడంతో జాగ్రత్తగా చూసుకోవాలని తల్లికి చెప్పాడు. ఇవన్నీ ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని తల్లి చెప్పింది. తల్లి మాట్లాడుతుండగానే జీవన్‌ ఫోన్‌ కట్‌ చేశాడు. తరువాత అఘాయిత్యానికి పాల్పడ్డాడు. క్షణికావేశంతోనే జీవన్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు నిర్థారణకు వచ్చారు.