AP Debts 2022: ఏపీ అప్పులకుప్పగా మారుతోంది. వైసీపీ సర్కారు అడ్డూ అదుపూ లేకుండా అప్పులు చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1,000 కోట్లు అప్పు చేసినట్టు తెలుస్తోంది. రిజర్వ్ బ్యాంకు నిర్వహించే సెక్యూరిటీ వేలం ద్వారా ఈ నెల 18న మరో వెయ్యి కోట్ల రూపాయలు సమీకరించినట్టు సమాచారం. 13 ఏళ్లకు రూ.500 కోట్లు.. మిగతా రూ.500 కోట్లు 16 ఏళ్లకు చెల్లించేలా ఒప్పందంతో అప్పు తీసుకున్నట్టు తెలుస్తోంది. తాజా అప్పుతో గత ఏప్రిల్ నుంచి ఏపీ ప్రభుత్వం తీసుకున్న అప్పు రూ.44,604 కోట్లుకు చేరినట్టు సమాచారం. ఇందులో ఒక్క ఆర్బీఐ నుంచి దాదాపు 34 వేల కోట్లు అప్పులు చేసినట్టు టాక్ నడుస్తోంది. నాబార్డు నుంచి రూ.40 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1333 కోట్లు, బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రూ.8,300 కోట్లు వైసీపీ సర్కారు అప్పులు తీసుకున్నట్టు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అడ్డూ అదుపులేని అప్పులు ఆందోళనలు కలిగిస్తున్నాయి. శాశ్వత ప్రయోజన ప్రాజెక్టులకు కాకుండా ఉచితాల కోసమే అప్పులు చేయడం విస్మయం గొలుపుతోంది. ఆర్థిక క్రమశిక్షణ కట్టుదాటుతోందని ఆర్థిక నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కట్టడి చర్యలేవీ?
అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహార శైలిపై కేంద్ర ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తోంది. కట్టడి చేసే ప్రయత్నం చేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరంలోని తొమ్మిది నెలలకుగాను రూ.43,803 కోట్లు అప్పు తెచ్చకునేందుకు జగన్ సర్కారుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నాలుగు నెలల్లోనే రికార్డు స్థాయిలో రూ.44,604 కోట్లు అప్పు తెచ్చింది. కేంద్రం అనుమతిని దాటి రుణాలకు వెంపర్లాడుతోంది. అయితే అప్పు కోసమే కంట్రీబ్యూటరీ పెన్సన్ స్కీమ్ రద్దు విషయంలో ఉపాధ్యాయులు , ఉద్యోగులు ఉద్యమ బాట పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల వ్యవధిలో రద్దు చేస్తామన్న మాటను సైతం మరిచిపోయారు. దీని వెనుక వేరే కథ ఉంది. సీపీఎస్ రద్దు చేయకుండా ఉంటే మరో రూ.4 వేల కోట్ల అప్పునకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముంది. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించినా మరో రూ.2 వేల కోట్లకుపైగా అప్పు వచ్చే అవకాశముంది. అందుకే నాలుగు నెలల్లో పరిమితికి మించి అప్పుచేసినా కేంద్రం మిన్నకుండా ఉందన్న ప్రచారం అయితే సాగుతోంది. అంటే ఇంకా ఐదు నెలల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం సరాసరి రూ.7 వేల కోట్లు అప్పు చేయడానికి కేంద్రం సమ్మతించిందన్న వార్తలు వస్తున్నాయి.
Also Read: Janasena Chief Pawan Kalyan: ఆ తొమ్మిది మందిపైనే.. పవన్ టార్గెట్ ఫిక్స్
దాని వెనక కథ ఇదా?
రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ హక్కుల సాధనకు ఉద్యమ బాట పట్టారు. గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నిలిచిన ఈ రెండు వర్గాల వారు ఇప్పుడు వ్యతిరేకంగా మారిపోయారు. పోరును మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. సీపీఎస్ ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయంగా ఇబ్బందికరంగా మారుతుందని తెలిసినా జగన్ సర్కారు పట్టించుకోవడం లేదు. దీనికి కేవలం కేంద్రం నుంచి అప్పుల అనుమతే కారణంగా తెలుస్తోంది. కేవలం రూ.4,200 కోట్ల అప్పు కోసం సీపీఎస్ రద్దు మాటనే జగన్ మరిచిపోయారు. అటు పొరుగు రాష్ట్రాలతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం వ్యతిరేకిస్తున్నా..తాను మాత్రం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు ఒప్పుకున్నారు.

సంస్కరణలు ఇక్కడ నుంచే..
గత మూడేళ్లుగా జగన్ సర్కారు అప్పుల కోసం నానా తిప్పలు పడుతోంది. అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలడం లేదు. ఇదే బలహీనతను కేంద్రం క్యాష్ చేసుకుంటుంది. ఏపీ నుంచే తన సంస్కరణలను మొదలు పెడుతోంది. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు, జాతీయ విద్యావిధానంలో భాగంగా పాఠశాలల ఎత్తివేత, ఉపాధ్యాయుల సర్దుబాటు, రేషనలైజేషన్..ఇలా ఒకటేమిటి కేంద్రం ఆదేశించిందే తరువాయి అమలుకు జగన్ సర్కారు ముందుంటుంది. అయితే దీని వెనుక అప్పులు పుట్టడమేనన్న నగ్న సత్యమైతే ఉంది. ఏపీ సర్కారు ఇలానే కొనసాగితే మాత్రం రాష్ట్రం అప్పులమయంగా మారడం గ్యారెంటీ. ఆర్థిక క్రమశిక్షణ కట్టుదాటి దివాళా దిశగా పయనించే దేశాల జాబితాలో చేరడం ఖాయమని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: AP Politics- MP Gorantla Madhav: ఏపీలో దిగంబర రాజకీయాలు.. ఎవరికి చేటు?

