AP Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులు వర్షాలు పడతాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రెండు, మూడు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఈరోజు అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు, మిగతా చోట్ల పిడుగులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది.
* మరోవైపు ఉత్తరాంధ్రలో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖ, పోలవరం జిల్లాల్లో శుక్రవారం నుంచి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి.
* అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.
* అల్పపీడన ప్రభావంతో రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. జూన్ 1 నాటికి ప్రవేశించాల్సిన రుతుపవనాలు.. దేశానికి ఆలస్యంగా తాకాయి.. విస్తరణలో కూడా తీవ్ర జాప్యం జరుగుతూ వచ్చింది. రుతుపవనాల కదలిక కూడా మందగించింది. అయితే తాజాగా అల్పపీడన ప్రభావంతో రుతుపవనాల విస్తరణకు చాన్స్ వచ్చింది.
* ఈ వర్షాలపై రైతులు నమ్మకం పెట్టుకున్నారు. మరో మూడు రోజులపాటు వర్షాలు ఉంటాయని చెబుతుండడంతో ఉపశమనం పొందుతున్నారు. అల్పపీడనం బలపడితే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
* సాధారణంగా జూన్ నుంచి డిసెంబరు వరకు భారీ వర్షాలు కురుస్తుంటాయి అల్పపీడనాలు, తుఫానుల ప్రభావంతో. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి అని అంచనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆవర్తనాల ప్రభావంతో వర్షాలు పడుతుండడం కొంత ఉపశమనం కలిగించే విషయం.

