AP Govt Teachers: ప్రభుత్వ ఉపాధ్యాయులకు( government teachers) గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. వచ్చే ఏప్రిల్, మే నెలలో ఉపాధ్యాయులకు బదిలీలతో పాటు పదోన్నతులు కల్పించనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఆ శాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఉపాధ్యాయ సంఘాల నుంచి వెళ్లిన కీలక ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వేసవిలో పదోన్నతులతోపాటు బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. హై స్కూల్ ప్లస్ లో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వేసవి సెలవుల్లో అదనంగా పనిచేసిన ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు కూడా మంజూరు చేయనున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వారం రోజుల్లో వెలువడనున్నాయి.
లోకేష్ ప్రత్యేక దృష్టి..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్( educational minister Nara Lokesh ) తనదైన ముద్ర చూపుతున్నారు. పాఠశాలల సర్దుబాటు, విభజన వంటి విషయాల్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టారు. అదనంగా ఎంఈఓ పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు బదిలీలతోపాటు పదోన్నతుల నిర్ణయం కూడా తీసుకున్నారు. దీనిపై ఉపాధ్యాయుల నుంచి సంతోషం వ్యక్తం అవుతోంది. రెగ్యులర్ ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ అయ్యేంతవరకు.. క్లస్టర్ టీచర్లు అవసరమైన పాఠశాలలకు మారుతూ పనిచేయాల్సి ఉంటుంది. బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియలో.. ఉపాధ్యాయుల పాతపాయింట్లను సైతం పరిగణలోకి తీసుకొనున్నారు. భవిష్యత్తులో ఉపాధ్యాయ సంఘాలతో ప్రతి వారం సమావేశం కావాలని కూడా నిర్ణయించారు. ఉపాధ్యాయుల జీతాలకు సంబంధించిన సమస్యలు తలెత్తితే.. వాటికి సంబంధించి వెంటనే పరిష్కార మార్గం చూపిస్తామని కూడా ఈ సమావేశంలో అధికారులు హామీ ఇచ్చినట్లు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తెలిపారు.
ఖాళీ టీచర్ పోస్టులపై..
ఉమ్మడి ప్రకాశం( Prakasam district) జిల్లాలోని నాలుగు ఎయిడెడ్ హై స్కూల్ లలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీపై దృష్టి పెట్టింది పాఠశాల విద్యాశాఖ. ఒంగోలులోని ఏబీఎం హై స్కూల్, ముప్పవరం పి ఎన్ అండ్ సిసి హై స్కూల్, చీరాల ఎం ఎన్ హై స్కూల్, కనిగిరి చిత్తరంజన్ అరబిక్ ఓరియంటల్ హైస్కూల్లో ఖాళీలు ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్ పోస్టులను కేటాయిస్తారు. దీనికి సంబంధించి పత్రిక ప్రకటనలు ఇచ్చి.. ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియను ప్రారంభిస్తారు. గతంలో టీచర్ల ఎంపిక కోసం అభ్యర్థులకు నేరుగా పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేవారు. అయితే ఈ విధానాన్ని మార్చి ఇప్పుడు కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈ ఆన్లైన్ పరీక్ష విధానాన్ని నాలుగు పాఠశాలల యాజమాన్యాలు వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. యేసును విచారించిన హైకోర్టు అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించుకోవడానికి అనుమతించింది. ఫలితాల విడుదల కు మాత్రం అభ్యంతరాలు తెలిపింది.. అందుకే ఇప్పుడు కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హైకోర్టు తుది తీర్పుకు అనుగుణంగా వ్యవహరించనున్నారు.