Visakha Utsav 2026: విశాఖ( Visakhapatnam) అంటేనే ఒక ప్రత్యేకత ఉంది. దేశంలోనే అత్యుత్తమ పర్యాటక ప్రాంతంగా నిలిచింది. సువిశాలమైన సముద్ర తీరం.. చుట్టూ పచ్చదనం విశాఖ సొంతం. అందుకే ఈసారి విశాఖ ఉత్సవ్ ను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది ప్రభుత్వం. మొన్నటికి మొన్న విజయవాడలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. ఇప్పుడు విశాఖ ఉత్సవ్ నిర్వహణకు కూడా దాదాపు 8 కోట్లు ఖర్చు చేయనుంది. నేటి నుంచి ఈ నెల 31 వరకు విశాఖ సాగర తీరంలో ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. గతం కంటే భిన్నంగా ఈసారి విశాఖ ఉత్సవ్ కు ప్లాన్ చేశారు. ఉమ్మడి ఏపీ నుంచి సైతం విశాఖ ఉత్సవ్ ను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా టిడిపి అధికారంలో ఉన్న సమయంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఈసారి కూడా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు తగ్గట్టు ఏర్పాటు చేసింది.
ఆర్కే బీచ్ లో ప్రధాన వేదిక…
విశాఖ బీచ్ రోడ్డు విశాఖ ఉత్సవ్ కు( Visakha Utsav) వేదికగా మారింది. రామకృష్ణ బీచ్ లో ప్రధాన వేదికగా అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వినోద కార్యక్రమాల సమ్మేళనంగా ఈసారి ఉత్సవ్ నిలవనుంది. ఉత్సవాల్లో భాగంగా ఫుడ్ స్టాల్స్, సాహస క్రీడలు, హెలిక్యాప్టర్ రైడ్, పారా మోటరింగ్ కార్యక్రమాలు ఉంటాయి. రుషికొండ బీచ్ లో సైతం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భీమిలి బీచ్ లో బోట్ రేసింగ్ ఏర్పాటు చేస్తున్నారు. సాగర తీరం వేదికగా కోస్టల్ ఫుట్బాల్ లీగ్, కోస్టల్ వాలీబాల్ లీగ్, కోస్టల్ కబడ్డీ లీగ్ పోటీలు నిర్వహించనున్నారు.
ఇతర ప్రాంతాల్లో సైతం..
అయితే ఒక సాగర తీరానికి మాత్రమే ఈ ఉత్సవ్ పరిమితం కావడం లేదు. అనకాపల్లి తో( Anakapalli) పాటు అరకు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు ఎనిమిది కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. విశాఖ ఉత్సవ్ నేపథ్యంలో పర్యాటకుల తాకిడి మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. వేలాదిమంది పర్యాటకులు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది..