
కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకొంటున్నది. ముఖ్యమంగా పొరుగు రాష్ట్రాల నుండి స్వగ్రామాలకు వచ్చే వారు తమ ఆధీనంలో ఉన్న క్వారంటైన్ లో ఉండాలని, అలా ఉంటేనే రాష్ట్రానికి రావాలంటే స్పష్టం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
దీంతో స్వగ్రామాలకు వచ్చేందుకు ప్రయత్నించిన ప్రయాణికులను తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పోలీసులు వారిని నిలిపివేశారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఎవరైనా సరే తప్పనిసరిగా 14రోజుల క్వారంటైన్ లో ఉండాలని స్పష్టం చేశారు.
క్వారంటైన్ పూర్తయిన తరువాత వారి వారి స్వగ్రామాలకు పంపిస్తామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలకు డాక్టర్లను పంపిస్తామని, కరోనా వైరస్ టెస్ట్ ల అనంతరం హోం క్వారంటైన్ కు పంపిస్తున్నట్లు చెప్పారు.
ఇలా ఉండగా, విదేశాల నుంచి వచ్చిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా స్క్రీనింగ్ చేస్తోంది. ఇప్పటివరకూ 26,059 మంది విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని వాలంటీర్లు గుర్తించారు. మరోవైపు 25,942 మందిని హోం ఐసోలేషన్‌లో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.
అలాగే 117మందిని ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకూ 332 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా, 289 కేసులు నెగటివ్‌గా, 10 కేసులు పాజిటివ్‌గా నిర్థారణ అయ్యాయి. మరో 33 కేసుల ఫలితాల కోసం వైద్యులు ఎదురు చూస్తున్నారు
రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్, నాకా బందీకి సీఎస్, డీజీపీలు ఆదేశాలు ఇచ్చారు. అన్ని రహదారులను బ్లాక్ చేసి, పోలీసులు భారీగా మోహరించారు. తెలంగాణ నుంచి వచ్చి 44 మందిని క్వారంటైన్‌కు తరలించి, వైద్యం అందిస్తున్నారు. ఇక ప్రజల సందేహాలు తీర్చేందుకు 24 గంటల కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే ఇరవై నాలుగు గంటలు పని చేసేలా నాలుగు టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు.