Pensions Distribution : ఏపీలో కూటమి ప్రభుత్వం రికార్డు.. జగన్ చేయనిది.. చేసి చూపించిన చంద్రబాబు

రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ఒకరోజులోనే పూర్తయింది. ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందించేవారు. వాలంటీర్లు లేకుండా పింఛన్ల పంపిణీ అసాధ్యమని వైసిపి సర్కార్ చెప్పుకొచ్చింది. కానీ అది తప్పు అని టిడిపి కూటమి ప్రభుత్వం నిరూపించింది.

Written By: Dharma, Updated On : August 2, 2024 9:48 am
Follow us on

Pensions Distribution : ఏపీలో కూటమి సర్కార్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. వరుసగా రెండో నెలలో కూడా పింఛన్ల పంపిణీ విజయవంతంగా పూర్తి చేసింది. సీఎం చంద్రబాబు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. తెల్లవారుజామున ఐదు గంటలకే పంపిణీ ప్రారంభించారు. వరుసుగా రెండో నెల కూడా సచివాలయ ఉద్యోగులతో పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు. గురువారం ఒక్క రోజులోనే 97.5 శాతం లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ పూర్తి చేయగలిగారు. గత నెలతో పోలిస్తే ఇది సరికొత్త రికార్డు. ఆగస్టులో 64.82 లక్షల మందికి పింఛన్లు అందించేందుకుగాను రూ. 2,737 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గురువారం రాత్రి తొమ్మిది గంటల నాటికి 63.18 లక్షల మందికి నగదు అందించగలిగారు. సీఎం చంద్రబాబు సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుండమలలో పింఛన్ల పంపిణీ చేపట్టారు.ఓబులమ్మ అనే వితంతువు, రామన్న అనే వృద్ధుడు ఇంటికి వెళ్లి పింఛన్ స్వయంగా అందజేశారు. చంద్రబాబు లబ్ధిదారుల కష్టాలను ఓపికగా విన్నారు.తనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని.. ఉపాధి కోసం బెంగళూరు వెళ్లారని..ఇల్లు బాగాలేదని కుమారులు రావడంలేదని.. వెంటనే స్పందించాలని కోరారు. దీనిపై చంద్రబాబు అక్కడే ఉన్న కలెక్టర్ ను పిలిచి ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు. రామన్న కుమారుడికి స్థానికంగా ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించాలని కూడా సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా పింఛన్ల పంపిణీ పూర్తి కావడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.

* వాలంటీర్లు లేకుండానే
వాలంటీర్లు లేకుండా రెండో నెల కూడా పింఛన్ల పంపిణీ సజావుగా పూర్తి కావడం విశేషం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పింఛన్ల పంపిణీ విషయంలోవివాదం తలెత్తిన సంగతి తెలిసిందే.ఎన్నికలకు ముందు సంక్షేమ పథకాలు అందించడం ద్వారా వలంటీర్లు ప్రభావితం చేస్తారని ఎన్నికల కమిషన్ భావించింది.సంక్షేమ పథకాల పంపిణీ బాధ్యతల నుంచి వారిని తప్పించింది. అదే సమయంలో అప్పటి వైసిపి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులతో పింఛన్లు పంపిణీ చేయలేమని తేల్చి చెప్పింది. అది సాధ్యం కాదని కూడా చెప్పుకొచ్చింది. వేసవిలో బ్యాంకుల్లోనూ, సచివాలయాల వద్ద పంపిణీ చేపట్టింది. దీంతో వృద్ధులు ఇబ్బంది పడ్డారు.

* ఎన్నికల ముందు వివాదం
అయితే అప్పట్లో పింఛన్ల పంపిణీలో జాప్యానికి, ఇబ్బందులకు టిడిపి కారణమని వైసిపి ఆరోపించింది. అయితే ప్రభుత్వం కావాలనే పింఛన్ల పంపిణీలో ఇబ్బందులు తెచ్చిపెట్టిందని.. సచివాలయ ఉద్యోగులతో పింఛన్ల పంపిణీ చేయవచ్చని టిడిపి చెప్పుకొచ్చింది. టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో దానిని చేసి చూపించింది. వరుసుగా రెండో నెల కూడా విజయవంతంగా సచివాలయం ఉద్యోగులకు పింఛన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయగలిగింది.

* పవన్ అభినందన
పింఛన్ల పంపిణీ విజయవంతంగా పూర్తి కావడంపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. గత పాలకుల తీరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా.. ఎలాంటి ఆటంకాలు లేకుండా సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్డీఏ కూటమి పింఛన్లను రెండో నెలలోనూ లబ్ధిదారులకు ఇంటి దగ్గరే విజయవంతంగా పంపిణీ చేశారని ప్రశంసించారు. సీఎం చంద్రబాబు కు అభినందనలు తెలిపారు. మంత్రి నారా లోకేష్ సైతం ట్విట్ చేశారు. వృద్ధుల కళ్ళల్లో ఆనందం, వారి చిరునవ్వులే మా కూటమి ప్రభుత్వానికి దీవెనలు అంటూ లోకేష్ స్పష్టం చేశారు.