AP Government’s Administration: ప్రభుత్వాలు( governments) ప్రజల కోసమే పని చేస్తాయి. అధికారం చేపట్టిన పార్టీలు ప్రజాసంక్షేమ ధ్యేయంగా ముందుకు సాగుతాయి. అయితే అవి వెళ్లే విధానాలు బట్టి ఫలితాలు ఉంటాయి. సంక్షేమానికి కొందరు ప్రాధాన్యమిస్తారు. ఇంకొందరు అభివృద్ధికి పెద్దపీట వేస్తారు. అయితే ఏపీలో మాత్రం అభివృద్ధి కంటే సంక్షేమం ఉంటేనే అధికారంలోకి వస్తాం అన్నది ఇప్పటి రాజకీయ పార్టీల స్ట్రాటజీ. 2019లో నవరత్నాలు ప్రకటించి అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా సంక్షేమాన్ని అమలు చేశారు. కానీ ప్రజలు మాత్రం అభివృద్ధిని కోరుకున్నారు. అలా అభివృద్ధితోపాటు సంక్షేమాన్ని కొనసాగిస్తానని చంద్రబాబు చెప్పడంతో కూటమికి జై కొట్టారు. గత ఏడాదిగా కూటమి పాలన అందించింది. సుపరిపాలన అందించామని కూటమి చెబుతుండగా.. హామీలు అమలు చేయలేదంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పనితీరును పరిశీలిస్తే మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది.
కొన్ని అంశాల్లో ప్లస్లు..
కొన్ని అంశాల్లో అయితే కూటమి( Alliance ) విజయవంతం అయినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా అమరావతి రాజధాని విషయంలో అనుకున్నది సాధించింది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి నిధుల సమీకరణ పూర్తి చేసింది. ప్రపంచ బ్యాంకు నిధులను నేరుగా పొందగలిగింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సైతం రుణం మంజూరు చేసింది. మరోవైపు వివిధ సంస్థలు 30 వేల రూపాయలు రుణంగా అందించాయి. అయితే ఇందులో చంద్రబాబు చాలా వరకు విజయవంతం అయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో అమరావతి రాజధాని పూర్తిగా నిర్వీర్యం అయింది. ప్లాన్ ఇచ్చేందుకు వచ్చిన సింగపూర్ను తరిమేశారు. అటు పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన స్టార్టప్ కంపెనీలు సైతం అక్కడి నుంచి వెళ్లిపోయాయి. భూములు ఇచ్చిన రైతులు రోడ్లపైకి వచ్చారు. వారిపై ఉక్కు పాదం మోపారు జగన్. మొత్తానికి అమరావతి అనేది స్మశానంలో మారిపోయింది. అటువంటి ప్రాంతాన్ని తిరిగి పట్టాలెక్కించడం చిన్న మాట కాదు. అది అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది సాధించారు చంద్రబాబు.
Also Read: AP Government: ఏపీలో 10 నెలల పాలన.. విపత్తులు, ప్రమాదాలు, వివాదాలు!
పోలవరం ప్రాజెక్ట్..
కూటమి సర్కార్ సాధించిన మరో ఘనత పోలవరం ప్రాజెక్ట్( polavaram project ). ఈ జలాశయం కీలక నిర్మాణాలు జరగాల్సి ఉంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు పోలవరం పై దృష్టి పెట్టారు. కేంద్ర ప్రభుత్వం సైతం దండిగా నిధులు మంజూరు చేస్తోంది. కీలక నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రాజెక్టుకు అవసరమైన అన్ని రకాల పనులు ముందుకు సాగుతున్నాయి. చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరుగుతోంది కేంద్రం నుంచి సాయం అందుతూనే ఉంది.
సామాజిక పింఛన్ల పెంపు..
కూటమి అతిపెద్ద విజయం సామాజిక పింఛన్లు పెంపు. ఒకేసారి పింఛన్ మొత్తాన్ని ₹1000 పెంచి.. నాలుగువేల రూపాయలను అందించింది కూటమి సర్కార్. అక్కడకు మూడు నెలల ముందు పెంచిన మొత్తాన్ని జత కలిపి అందించింది. సచివాలయ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో పింఛన్లు విజయవంతంగా అందించగలుగుతోంది. ఇది ఆషామాషీ విషయం కాదు. లక్షల వాలంటీర్లతో జగన్ సర్కార్ పింఛన్లు పంపిణీ చేయగా.. కూటమి సర్కార్ మాత్రం ఒంటి చేత్తో సచివాలయ ఉద్యోగులతో అందించి రికార్డు సృష్టించింది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు లక్షల పెట్టుబడులు పెట్టాయి. విశాఖ తో పాటు శ్రీ సిటీ వంటి ప్రాంతాల్లో పెట్టుబడులు వరదల్లా వచ్చాయి. మరోవైపు ఓడరేవుల అభివృద్ధి కూడా జరుగుతోంది. విశాఖకు దిగ్గజ ఐటీ పరిశ్రమలు తరలివస్తున్నాయి. అమరావతిలో రైల్వే, రవాణా ప్రాజెక్టులకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తూ కేటాయింపులు చేసింది.
Also Read: AP Kutami Government: ఏడాది కూటమి పాలన.. వచ్చే నాలుగేళ్లలో జరిగేది అదే!
రాజకీయ స్థిరత్వం
మరోవైపు టిడిపి కూటమి( TDP Alliance ) సాధించిన అతిపెద్ద విజయం రాజకీయ స్థిరత్వం. గతం మాదిరిగా చంద్రబాబు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదు. రాజకీయ ప్రత్యర్థుల వలలో చిక్కుకోవడం లేదు. కేవలం ప్రత్యేక హోదా అనే అంశం మాటున వైసిపి పన్నాగంలో చిక్కుకున్నారు చంద్రబాబు. నాడు ఉన్నఫలంగా ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి చేతులు కాల్చుకున్నారు. దానిని ఇప్పుడు గుణపాఠంగా మార్చుకొని.. సంయమన రాజకీయంతో ముందుకు సాగుతున్నారు. కేంద్రంతో సర్దుబాటుతో ముందుకు వెళుతూ.. తనకు వచ్చిన రాజకీయ అవకాశాన్ని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులను అవినీతి ఆరోపణ కేసుల్లో వెంటాడుతున్నారు. వేటాడినంత పని చేస్తున్నారు. రాజకీయ పగతో కాకుండా పూర్తి ఆధారాలతో వారిని కేసుల్లో బంధిస్తున్నారు.
మైనస్లు అధికమే..
అయితే కూటమి సర్కార్లో మైనస్లు కూడా అధికంగానే ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు( CM Chandrababu) కొన్ని వివాదాలను ఏరి కోరి తెచ్చుకుంటున్నారు. అమరావతి రాజధానికి అదనపు భూసేకరణ, భూ సమీకరణ అంటూ కొత్త సమస్యను తెచ్చుకుంటున్నారు. వీలైనంత త్వరగా అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తిచేసి క్రెడిట్ దక్కించుకోవాలి. కానీ ఇప్పుడు అదనపు భూ సమీకరణ అంటూ కొత్త భారం మోపుకుంటున్నారు. ఇంకోవైపు పోలవరం ప్రాజెక్టుకు బనకచర్లను అనుసంధానం చేస్తానని చెబుతున్నారు. దీనికి 80 వేల కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు అవసరం. ఇది కూడా చంద్రబాబుకు అనవసరం. ఇక ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ పెద్దలపై సానుకూలత ఉంది. కానీ దిగువ స్థాయిలో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. జగన్ హయాం మాదిరిగానే అవినీతి ఆరోపణలు కొనసాగుతున్నాయి. మరోవైపు సామాన్య జనాలకు సంబంధంలేని టెక్నాలజీ మాటలను మళ్లీ తెరపైకి తెస్తున్నారు చంద్రబాబు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్ వంటి మాటలతో సామాన్యులకు అంతుబట్టని రీతిలో ప్రసంగాలు చేస్తున్నారు. వీటన్నింటినీ కొంతవరకు నియంత్రించగలిగితే ప్రజల్లో ఎక్కువ శాతం సానుకూలత పొందే అవకాశం ఉంది. ఇలా ఎలా చూసుకున్న కూటమి ఏడాది పాలనలో ప్రజల్లో చిన్నపాటి నమ్మకం ఏర్పరచుకుంది. తమకు మంచి ప్రభుత్వం ఉందన్న ఉద్దేశం ఇప్పుడిప్పుడే బలపడుతోంది. వచ్చే నాలుగేళ్లలో ఇది మరింత బలంగా చేసుకుంటే మాత్రం కూటమికి తిరుగులేదు. లేకుంటే మాత్రం కష్టమే.