Demonstration of Govt creatures : గత ఐదేళ్లుగా వైసీపీ పాలనలో ప్రభుత్వ జీవోలు ఆన్ లైన్ లో కనిపించలేదు. అప్పటివరకు ఉన్న ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు జీవోలను ఆన్ లైన్ లో ప్రజలకు అందుబాటులో ఉంచేవి. అవసరం అయిన వారు వాటిని ఇట్టే చూసుకునేవారు. అయితే వైసిపి హయాంలో రోజుకో జీవో, పూటకో ఉత్తర్వు వచ్చేది. వాటిని ఆన్ లైన్ లో పెడితే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని అప్పటి ప్రభుత్వం భావించింది. అందుకే జీవో ఐ ఆర్ పోర్టల్ ను నిలిపివేసింది. తమ అరాచక చర్యలు, అస్తవ్యస్త నిర్ణయాలు, దోపిడీ గురించి ప్రజలకు తెలియకుండా దాచేసే పనిలో భాగంగానే ఆ పోర్టల్ ను నిలిపివేసినట్లు విమర్శలు వచ్చాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజలకు తెలియజేయాలని డిసైడ్ అయ్యింది. ఈనెల 29 నుంచి ప్రభుత్వం జారీ చేసి ప్రతి జీవోను జీవో ఐ ఆర్ పోర్టల్ లో అప్లోడ్ చేయనున్నారు. ప్రజలు వాటిని స్వేచ్ఛగా చూడవచ్చు. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో సచివాలయంలోని ప్రతి సెక్షన్ లోను జీవోలకు మాన్యువల్ రిజిస్టర్లు నిర్వహించేవారు. వాటిలో నంబరు రాసి జీవోలు విడుదల చేసేవారు. సాధారణ ప్రజలకు తెలిసేవి కావు. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చాక ప్రతి జీవోను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. అందుకే 2008లో ఉమ్మడి ఏపీలో అప్పటి ప్రభుత్వం జీవో ఐఆర్ పోర్టల్ ను రూపొందించింది. అటు తరువాత వచ్చిన ప్రభుత్వాలన్నీ ఈ పోర్టల్ ను అందుబాటులో ఉంచేవి. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం జీవోల విషయంలో రివర్స్ ధోరణిని అనుసరించింది. 2008కి ముందున్న మాన్యువల్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. మళ్లీ కూటమి ప్రభుత్వం ఈ పోర్టల్ ను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది.
* ప్రదర్శన నిలిపివేత
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. కొన్నాళ్లపాటు జీవో ఐ ఆర్ పోర్టల్ ను కొనసాగించింది. అయితే అడ్డగోలు నిర్ణయాలకు సంబంధించి జీవోల విషయం బయటపడింది. మీడియాలో చర్చకు దారితీసింది. దీనిపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నడిచింది. దీనికి తోడు కోర్టులో సైతం కేసులు ఎదురయ్యాయి. దీంతో కొన్నాళ్లపాటు ఆన్ లైన్ లో జీవోల నెంబర్లు పెట్టి.. మిగతా సమాచారాన్ని ఖాళీగా ఉంచేసేది. జీవో నెంబర్ను అనుసరించి ఆయా శాఖలకు సంప్రదించి సమాచారం తెలుసుకునే పరిస్థితి ఉండేది. అయితే దీనిపై విమర్శలు రావడంతో ఏకంగా జీవో ఐఆర్ పోర్టల్ని జగన్ సర్కార్ మూసేసింది.
* న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో
సమాచార హక్కు చట్టానికి ఇది వ్యతిరేకమంటూ చాలామంది జగన్ సర్కార్ పై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 2021 సెప్టెంబర్ 7న జీవో 100ను జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులతో పాటు టాప్ సీక్రెట్, సీక్రెట్, కాన్ఫిడెన్షియల్, రొటీన్ నేచర్ జీవోలను ఏపీ ఈ గెజిట్ పోర్టల్ లో వారానికోసారి అప్లోడ్ చేస్తామని చెప్పింది. ప్రభుత్వ జీవోలన్నీ ఉండడంతో ప్రజలు వెతుక్కోవడానికి ఇబ్బందిగా ఉందని.. వారికి అవసరమైన జీవోలను మాత్రమే పెడతామని కోర్టుకు బదులిచ్చింది. 2021 ఆగస్టు 15 నుంచి జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లో ఏడు శాతం మాత్రమే అప్లోడ్ చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
* పారదర్శకత కోసం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పోర్టల్ ను మరోసారి అందుబాటులోకి తేనున్నారు. మొత్తం జీవోలు అప్లోడ్ చేయడం ద్వారా పారదర్శక పాలనకు పెద్ద పీట వేయాలని నిర్ణయించారు. ప్రజలు స్వేచ్ఛగా ఆ జీవోలను చూసుకోవచ్చు. అయితే జగన్ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఈ జీవోలను సైతం అందుబాటులోకి తెచ్చి ప్రజలకు చూపించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. గత ప్రభుత్వం చాలా ఉత్తర్వుల మెమోలు, యువో నోట్ల రూపంలో ఇచ్చిందని.. వాటిని ప్రజలకు చూపిస్తే వాస్తవాలు తెలుస్తాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ap government will show govt go online from 29th
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com