AP Government : ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్న క్రమంలో ఎన్నికల హామీలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని పెంచి అమలు చేసింది.గత ఆరు నెలలుగా అందిస్తూ వస్తోంది. ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ జరుగుతోంది. అదే సమయంలో అనర్హులకు పెన్షన్ల పై అధ్యయనం చేస్తోంది. అయితే అర్హులకు కోత ఉండదని ప్రభుత్వం తేల్చి చెబుతోంది. అదే సమయంలో జనవరి 1న పంపిణీ చేయాల్సిన పింఛన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. వైసిపి ప్రభుత్వం ప్రతినెల ఒకటో తేదీన వలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేసేది.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ సిబ్బందితో వాటిని అందించే ప్రయత్నం చేస్తోంది. సీఎం చంద్రబాబు తో పాటు ఎమ్మెల్యేలు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఒకవేళ ఒకటో తేదీ సెలవు ఉంటే ముందు రోజే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.
* పింఛన్లపై సర్వే
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లపై సర్వే జరుగుతోంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున అనర్హత పింఛన్లు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత బోగస్పించనులపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఆధార్ కార్డు పై పుట్టిన తేదీ మార్చి, వైకల్య శాతం పెంచుకొని, అక్రమంగా సదరం సర్టిఫికెట్ పొంది.. ఇలా రకరకాల కారణాలతో పెద్ద ఎత్తున బోగస్ పింఛన్లు దక్కించుకున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయోగాత్మకంగా కొన్ని సచివాలయాల్లో సర్వే చేపట్టింది. ఏ ఏ కారణాలతో బోగస్ పింఛన్లు తీసుకుంటున్నారో గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బోగస్ పింఛన్లు తొలగించేందుకు సిద్ధపడుతోంది.
* ఈనెల 31న పంపిణీ
అయితే జనవరి ఒకటి నూతన సంవత్సరం కావడంతో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. డిసెంబర్ 31న పింఛన్లు అందించేందుకు సిద్ధపడుతోంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను సైతం జారీ చేసింది. ఆరోజు సీఎం చంద్రబాబు స్వయంగా పింఛన్లు అందించనున్నారు. అయితే ఈ నెలకు సంబంధించి పింఛన్ల తొలగింపు ఉండదు. రాష్ట్రవ్యాప్తంగా బోగస్ పింఛన్లు తొలగిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. మొన్నటి కలెక్టర్ల సమావేశంలో సైతం ఇదే విషయం పై చర్చ జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో బోగస్ పింఛన్లు ఉండకూడదని సీఎం గట్టిగానే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జనవరి నుంచే బోగస్ పింఛన్లు తొలగిస్తారని టాక్ నడిచింది. అయితే ఇప్పటికేబోగస్ పెన్షనర్లకు నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా సదరం సర్టిఫికెట్ సమర్పించి పింఛన్లు దక్కించుకున్న వారికి నోటీసులు అందిస్తారు. వారు ఇచ్చే సమాధానం, వైకల్యం ధ్రువీకరణ వంటివి పరిగణలోకి తీసుకుంటారు. అయితే మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఈ నెలకు బోగస్ పింఛన్ల తొలగింపు లేనట్టే. ఫిబ్రవరి నెల కు సంబంధించిన మాత్రం బోగస్ పింఛన్లు తొలగిస్తారని ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి.