https://oktelugu.com/

AP Salaries: ఏపీలో 5వ తేదీ వచ్చినా టీచర్లకు జీతాలు రాలేదా? 5వేల కోట్ల అప్పు ఏమైనట్టు? నిజమెంత?

ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులు (government teachers) తీవ్ర ఆందోళనతో ఉన్నారు. జీతాల విషయంలో చంద్రబాబు (Chandrababu) ఇచ్చిన హామీ అమలు కాకపోవడమే అందుకు కారణం.

Written By:
  • Dharma
  • , Updated On : January 6, 2025 / 05:27 PM IST

    AP Salaries

    Follow us on

    AP Salaries: జనవరి రెండో వారం సమీపిస్తున్నా ఇంతవరకు ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు (government teachers) జీతాలు అందలేదు. ప్రతి శాఖకు చెందిన ఉద్యోగికి ఈనెల 1న ప్రభుత్వం జీతాలు (salaries) జమ చేసింది. కానీ ఉపాధ్యాయుల విషయంలో మాత్రం జాప్యం చేసింది. నిన్నటి వరకు పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులకు జీతాలు పడలేదు. దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఇదే మాదిరిగా ఉపాధ్యాయులకు జీతాలు ఆలస్యమయ్యాయి. మూడో వారానికి దాటిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పట్లో ఇది వైసిపి ప్రభుత్వం పట్ల ప్రతికూలత చూపించింది. ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయింది. ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వంలో సైతం అదే పరిస్థితి రావడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో (social media) సైతం విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎంతో కసితో జగన్ పార్టీని ఓడించామని.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని.. కానీ ఇప్పుడు కూడా న్యాయం జరగకపోతే ఎలా అంటూ కొంతమంది ఉపాధ్యాయులు బాహటంగానే ప్రశ్నిస్తున్నారు. నేరుగా కూటమి నేతలని ప్రశ్నిస్తున్నట్లు ఆడియోలు సైతం బయటకు వచ్చాయి.

    * నాడు వైసీపీకి మద్దతు
    2019లో వైసీపీకి బాహటంగానే మద్దతు తెలిపిన వర్గంలో ఉపాధ్యాయులు ఒకరు. తాను అధికారంలోకి వస్తే సిపిఎస్ (contributary pension scheme) రద్దు చేస్తానని హామీ ఇచ్చారు జగన్. దీంతో ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. వైసీపీకి ఏకపక్షంగా ఓట్లు వేశారు. అటు సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపారు. ఎప్పుడైతే సిపిఎస్ రద్దు చేయలేదో.. ఉపాధ్యాయుల విషయంలో వివక్ష చూపారో.. అప్పటినుంచి వైసీపీకి ప్రత్యర్థులుగా మారిపోయారు ఉపాధ్యాయులు. వైసీపీని బాహటంగానే విమర్శించడం ప్రారంభించారు. కూటమికి అనుకూలంగా మారిపోయారు. అయితే తాము అధికారంలోకి వస్తే ప్రతి నెల ఒకటో తేదీన జీతం అందించడంతో పాటు ఉద్యోగుల కళ్ళల్లో ఆనందం చూస్తానని చంద్రబాబు (Chandrababu) హామీ ఇచ్చారు. గత ఆరు నెలలుగా ఒకటో తేదీన జీతాలు అందించగలిగారు. అయితే ఈ నెల మాత్రం ఐదో తేదీ వరకు ఉపాధ్యాయుల ఖాతాల్లో జీతాలు జమ కాలేదు. దీంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన ప్రారంభం అయ్యింది.

    * ఆ రుణం ఏమైనట్టు?
    సామాజిక పింఛన్లతో (social pensions) పాటు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల కోసం ప్రభుత్వం 5000 కోట్ల రూపాయలు రుణంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ఐదు వేల కోట్ల రూపాయలు ఎటు వెళ్లిపోయాయని సోషల్ మీడియా వేదికగా ప్రచారం ప్రారంభం అయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జూలైలో మాత్రమే ఒకటో తేదీన జీతాలు వేశారని.. అప్పటినుంచి ప్రతి నెలా జీతాలు ఆలస్యం అవుతున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం వైసీపీకి ఎదురైన పరిణామాలే.. టిడిపి కూటమికి కూడా తప్పవని ఉపాధ్యాయ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అయితే సాంకేతిక కారణాలతోనే (technical issues) జీతాలు ఆలస్యం అయ్యాయి తప్ప.. మరొకటి కాదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.