AP Government: ఏపీ ప్రభుత్వం( AP government) దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికి సరికొత్త వాహనాలను అందించనుంది. త్రిచక్ర వాహనాలను ఉచితంగా పంపిణీ చేయనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దివ్యాంగులకు సంబంధించిన మోటారు వాహనాలకు రాయితీపై పెట్రోల్ అందిస్తోంది. పని ప్రదేశాల నుంచి ఇంటి వరకు ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారికి ఈ రాయితీ వర్తింప చేస్తోంది. తాజాగా ఉచితంగానే ద్విచక్ర వాహనాలు అందించేందుకు నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలు 875 వాహనాల పంపిణీకి నిర్ణయించింది. ఒక్కో దాని ఖరీదు రూ.1.07 లక్షలు కాగా.. దివ్యాంగులకు శతశాతం రాయితీపైన అందించనుంది. ఈ మేరకు అర్హుల నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించనుంది. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు కూడా చేయనున్నారు.
* మొత్తం 1750 వాహనాలు..
ఈ ఆర్థిక సంవత్సరంలో 1750 మంది లబ్ధిదారులకు ఉచితంగా మూడు చక్రాల వాహనాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గంలో పదిమంది దివ్యాంగులకు ఈ వాహనాలు అందనున్నాయి. అందులో భాగంగా తొలి విడతగా 875 మందికి పంపిణీ చేసేందుకు నిర్ణయించారు. ఇందుకోసం రూ.9.44 కోట్ల వ్యయం కానుంది. రెండో విడతలో మిగతా వారికి పంపిణీ చేయనున్నారు. అయితే ఈ మూడు చక్రాల వాహనాలను తయారు చేసే బాధ్యతను విజయవాడకు చెందిన ఆర్ఎం మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చూస్తోంది. ఇటీవల టెండర్ ప్రక్రియ నిర్వహించగా దక్కించుకుంది సదరు సంస్థ. హీరో కంపెనీ మోటార్ వాహనాలను అందించనుంది. దీని సామర్థ్యం 125 సిసి. రెండు వారాల్లో బిడ్ ఫైనలైజ్ కమిటీ ఆమోదం తర్వాత.. దివ్యాంగుల సంక్షేమ శాఖ లబ్ధిదారుల ఎంపికకు దరఖాస్తులు స్వీకరించనుంది. ఇప్పటికే దివ్యాంగుల మూడు చక్రాల వాహనాలకు సంబంధించి ప్రభుత్వం రాయితీపై పెట్రోల్ అందిస్తున్న సంగతి తెలిసిందే.
* నిరుద్యోగులకు ప్రాధాన్యం..
నిరుద్యోగ దివ్యాంగ యువతకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. డిగ్రీ, ఆపై విద్య అభ్యసించే విద్యార్థులకు.. కనీసం ఏడాదికి పైగా స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారికి ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 70 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు అర్హులు. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు వారు అయి ఉండాలి. ఆదాయ పరిమితి మూడు లక్షల రూపాయల లోపు ఉండాలి. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. తొలి విడతగా 875 మోటార్ వాహనాలను అందించేందుకు నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మిగతా వారికి సైతం అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది ఏపీ ప్రభుత్వం. మరి కొద్ది రోజుల్లోనే ఈ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది.